
దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరూ దాదాపు ఈపీఎఫ్‌వో అకౌంట్ కలిగి ఉంటారు. ఇటీవల కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం ప్రతీ ఉద్యోగికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గిగ్ కార్మికులకు కూడా పీఎఫ్ సదుపాయం కల్పించాలని సూచించింది. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు అలర్ట్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే ఈపీఎఫ్‌వో సేవల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. వీటి పట్ల పీఎఫ్ ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే అకౌంట్లలోని డబ్బులను కొల్లగొట్టే ప్రమాదముంది. అసలేంటి ఈ మోసాలు..? పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అయితే పీఎఫ్ చందాదారులు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కేవైసీ పేరుతో పీఎఫ్ ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారు కొంతమంది మోసగాళ్లు. ఈపీఎఫ్‌వో అధికారులమని చెప్పుకుంటూ కాల్స్ చేస్తున్నారు. వాట్సప్, ఈమెయిల్స్, ఎంఎంఎస్, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించి అక్రమాలకు పాల్పడుతున్నారు. కేవైసీ కోసం పీఎఫ్ ఖాతా వివరాలు చెప్పాలంటూ తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈపీఎఫ్‌వో అధికారులమని చెప్పుకుంటే ఎవరైనా కాల్ చేస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ఎవరికి ఈపీఎఫ్‌వో ఓటీపీలు, వివరాలు, పాస్ వర్డ్‌లు షేర్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఈపీఎఫ్‌వో కేవేసీ చేసుకోవాలంటే ఎవరికి ఫోన్ కాల్స్, వాట్సప్ మెస్సేజ్‌లు పెట్టదు. దీనిని ఖాతాదారులు గమనించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కేవలం ఈపీఎఫ్‌వో పోర్టల్, ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే ఈపీఎఫ్‌వో సేవలు పొందే అవకాశముంది. ఇక ఎలాంటి థర్డ్ పార్టీ వ్యక్తులు, ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ సేవలు పొందే అవకాశం లేదు. దీంతో ఎవరైనా ఈపీఎఫ్ సేవలు అందిస్తామని థర్డ్ పార్టీ వ్యక్తులు సంప్రదిస్తే జాగ్రత్త పడాలి. ఈపీఎఫ్‌వో ఎలాంటి థర్డ్ పార్టీ సర్వీసులు అందించడం లేదు. దీంతో ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్లకు అందిస్తే మీ పీఎఫ్ అకౌంట్లోని నగదును కాజేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా ఇలా సంప్రదిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవాలన్నా, బ్యాలెన్స్ వివరాలు చెక్ చేసుకోవాలన్నా అధికారిక పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌ను విజిట్ చేయాలి. ఇక కేవైసీ అప్డేట్, ఇతర వివరాల అప్ డేట్ కోసం వాటిని మాత్రమే సంప్రదించాలి. థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఎలాంటి ఈపీఎఫ్ సేవలు అందించవు.