E20 Petrol: ఈ20 పెట్రోల్ వల్ల వెహికల్ చెడిపోతుందా..? నితిన్ గడ్కరీ ఫుల్ క్లారిటీ..

ఈ20 పెట్రోల్‌పై వస్తున్న వాదనలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను వేరే దేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారని, ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల్లో సమస్యలు వస్తున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తమని ఆయన అన్నారు. అన్ని పరీక్షల తర్వాతే ఇంధనాన్ని తీసుకొచ్చామన్నారు.

E20 Petrol: ఈ20 పెట్రోల్ వల్ల వెహికల్ చెడిపోతుందా..? నితిన్ గడ్కరీ ఫుల్ క్లారిటీ..
E20 Petrol

Updated on: Jul 08, 2026 | 5:35 PM

ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలపై కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఈ20 ఇంధనం వాడటం వల్ల వాహనాలు మరమ్మత్తులకు గురవుతున్నాయని, వాహనాల సామర్థ్యం కూడా తగ్గే అవకాశముందన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఇంధనం వల్ల సమస్యలకు గురైన ఒక్క వాహనాన్నైనా చూపించమని ఆయన సవాల్ విసిరారు. E20 పెట్రోల్ వల్ల ఏ కారు కూడా సమస్యలను ఎదుర్కొన్న దాఖలాలు లేవని, అలాంటి కారు ఒక్కటైనా ఉంటే చెప్పండి అంటూ ఛాలెంజ్ చేశారు. అధిక ఇథనాల్ కలిపిన పెట్రోల్ విడుదల గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతున్నాయన్న ఆయన.. ఇవి డబ్బు చెల్లించి చేయిస్తున్న ప్రచారాలు అంటూ ఆరోపించారు.

తన కుటుంబానికి పరిశ్రమలు లేవు

విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించడంతో పాటు పర్యావరణానికి మేలు చేకూరేలా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఈ20 ఇంధనం ఉపయోగపడుతుందని గడ్కరీ తెలిపారు. చెరకు, మొక్కజొన్న, వరి వంటి జీవపదార్థాల నుండి ఉత్పత్తి చేసిన ఇథనాల్‌ను ఉపయోగించి దీనిని తయారుచేస్తున్నట్లు చెప్పారు. తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలు ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాయని, అందువల్ల ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలను గడ్కరీ తప్పుబట్టారు. తమ కుటుంబానికి చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, అయితే వారి వ్యాపారాలు ఇథనాల్ ఉత్పత్తిపై ఆధారపడి లేవని స్పష్టం చేశారు.

హైడ్రోజన్ వాహనాలు వాడండి

స్వచ్ఛమైన రవాణా రంగంలో హైడ్రోజన్ తదుపరి ముందడుగు అని వ్యాఖ్యానించిన గడ్కరీ.. తాను వ్యక్తిగతంగా అనేక ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను ఉపయోగిస్తున్నానని అన్నారు. ప్రజలు కూడా ఈ సాంకేతికతను స్వయంగా అందిపుచ్చుకోవాలన్నారు. తాను ఎలక్ట్రిక్, ఫ్లెక్స్-ఫ్యూయల్, హైడ్రోజన్ వాహనాలను నడుపుతానని, ప్రస్తుతం తన ఇంట్లో ఆ మూడు ఉన్నాయన్నారు. తన ఇంట్లో ఆ మూడు కార్లూ ఉన్నాయని, అర్థం చేసుకున్న వాళ్ళు కార్యక్రమం తర్వాత తమ ఇంటికి వచ్చి ఆ మూడు కార్లలోనూ ఒకసారి ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. తాను హైడ్రోజన్ కారులో ప్రయాణిస్తానని, ఇది మెర్సిడెస్ కంటే మెరుగైనదని గడ్కరీ అన్నారు. ఈ అనుభవం ఆ సాంకేతికత సామర్థ్యంపై తనకు నమ్మకం కలిగించిందని తెలిపారు. కాగా గత కొంతకాలంగా ఈ20 పెట్రోల్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఇది వాడితే వాహనాలు పాడవుతాయని, త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Follow Us