స్టాక్ మార్కెట్‌కు ‘ట్రంప్’ భయం.. ఒక్క రోజే రూ.7 లక్షల కోట్ల ఆవిరి

India Stock Market: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టడం భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. పొరుగుదేశాలతో పాటు భారత్ వంటి దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలో ప్రకటించడం మార్కెట్లను ఒత్తిళ్లకు గురిచేసింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ సూచీలు 7 మాసాల కనిష్ఠ స్థాయికి పతనమయ్యాయి.

స్టాక్ మార్కెట్‌కు ‘ట్రంప్’ భయం.. ఒక్క రోజే రూ.7 లక్షల కోట్ల ఆవిరి
Stock Market

Updated on: Jan 21, 2025 | 5:30 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ట్రంప్ భయం పట్టుకుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా పతనమయ్యాయి. ఉదయం పాజిటివ్‌గా ట్రేడింగ్ ప్రారంభమైనా.. మదుపర్లు విక్రయాల వైపు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23 వేల పాయింట్ల దిగువునకు పడిపోయింది. మంగళవారంనాడు సెన్సెక్స్ 1235.08 పాయింట్ల నష్టంతో ఏడే మాసాల కనిష్ఠ స్థాయిలో 75,838.36 పాయింట్ల దగ్గర క్లోజ్ కాగా.. నిఫ్టీ 320.10 పాయింట్ల నష్టంతో 23,024.65 పాయింట్ల వద్ద ముగిసింది.

ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు ఆటోమొబైల్ రంగానికి చెందిన స్టాక్స్ భారీగా నష్టపోయాయి. మంగళవారం (జనవరి 21, 2025) ఒక్క రోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్‌‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో.. పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలపై వాణిజ్య సుంకాలను విధించే అవకాశముందన్న అంచనాలు అంతర్జాతీయ మార్కెట్ల‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ట్రంప్ భయాలతో భారత దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఉన్న షేర్లను కొంతమంది మదుపర్లు అమ్ముకున్నారు. దీంతో మార్కెట్‌ అమ్మకాల ఒత్తిడికి గురయింది. కొనుగోళ్లు తక్కువగా ఉండటం.. అమ్మకాలు విపరీతంగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది.