
Online Frauds: ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి వేలు, లక్షలు కోల్పోయారంటూ నిరంతరం వార్తలు చూస్తూనే ఉంటాం. సైబర్ నేరగాళ్లు రోజుకో వినూత్న రీతిలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లోని లక్షల రూపాయలను కొల్లగొట్టేస్తున్నారు. చివరికి మోసపోయాక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినా లాభం లేకుండా పోతుంది. విదేశాల నుంచి లేదా వేరే రాష్ట్రాల నుంచి సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతుండటంతో వారిని పట్టుకుని డబ్బులను రికవరీ చేయడం కూడా కష్టంగా మారుతుంది. దీంతో మోసపోయాక కాకుండా ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. ఇటీవల క్రెడిట్ కార్డు మోసాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మోసగించి క్రెడిట్ కార్డుల్లోని డబ్బులను దోచేస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని మార్గాల ద్వారా మనం డబ్బులు తిరిగి తెచ్చుకోవచ్చు.
మీకు తెలియకుండా క్రెడిట్ కార్డులోని డబ్బులు విత్ డ్రా అయినప్పుడు వెంటనే కార్డ్ బ్లాక్ చేయండి. బ్యాంక్ మొబైల్ యాప్స్ లేకుండా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా మీరు ఈ పని చేయవచ్చు. 24 గంటలు ఈ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. మీరు ఏ క్షణమైనా కార్డను బ్లాక్ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డు నుంచి అనధికార ట్రాన్సాక్షన్లు జరగకుండా ఇది ఉపయోగపడుతుంది.
మీ క్రెడిట్ కార్డు నుంచి మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి. బ్యాంకులు వివాద ఫారమ్‌ను నింపమని అడుగుతాయి. వీరి ఆ ఫారమ్‌లో తేదీ, ఐడీ, చెల్లింపు ఆమోదించలేదని నిర్ధారించే వివరాలు వంటివి నమోదు చేయాలి. మీరు వివరాలు ఇవ్వగానే బ్యాంకు దర్యాప్తు చేపడుతుంది. ఒకవేళ మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు నిర్ధారణ అయితే బ్యాంక్ మీకు సహాయపడుతుంది.
మీ కేసును త్వరగా పరిష్కరించడానికి మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు అన్నీ అధికారిక ఫ్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదు చేయండి. బ్యాంక్ కస్టమర్ కేర్, యాప్స్, ఆన్‌లైన్ ఫ్లాట్ఫామ్, ఆర్‌బీఐ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ, సమీప పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయండి. ఇలా ఫిర్యాదు చేయడం వల్ల మీకు త్వరగా పని జరుగుతుంది.
మోసానికి సంబంధించిన ప్రతీ సమాచారాన్ని మీరు భద్రపర్చుకోండి. మెస్సేజ్‌లు, స్టేట్‌మెంట్, ఎఫ్‌ఐఆర్ కాపీలు, లావేదేవీల స్క్రీన్ షాట్‌లు, బ్యాంకు ఈ మెయిల్స్ వంటివి సేవ్ చేసి పెట్టుకోండి. ఈ రికార్డులు మీ క్లెయిమ్‌ను బలవంతం చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆర్‌బీఐ, బ్యాంక్ నిబంధనల ప్రకారం డబ్బులను తిరిగి పొందటంలో ఇవి సహాయపడతాయి. ఒకవేళ మోసపూరిత లావాదేవీ జరిగినట్లు నిర్ధారణ అయితే మీకు తిరిగి డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి