తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకే రాసిచ్చినప్పుడు కూతుళ్లు ఏం చేయాలి..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

రక్తసంబంధాలను సైతం బద్ధశత్రువులుగా మార్చేసే శక్తి ఒక్క ఆస్తి తగాదాలకే ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్న ఆస్తినంతా కొడుకుకే రాసేస్తే.. ఇక ఆడపిల్లలకు చిల్లిగవ్వ కూడా దక్కదా? చట్టం కూతుళ్లకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? అనే ప్రశ్నలు చాలా కుటుంబాల్లో తలెత్తుతుంటాయి. కొడుకుతో పాటు కూతురికీ సమాన హక్కు ఎప్పుడు దక్కుతుంది? రిజిస్ట్రేషన్ అయిపోయినా కోర్టును ఆశ్రయించవచ్చా? అనే వివరాలు తెలుసుకుందాం..

తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకే రాసిచ్చినప్పుడు కూతుళ్లు ఏం చేయాలి..? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..
Daughters Property Rights

Updated on: Sep 06, 2026 | 12:39 PM

తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు దూరం కావడానికి, కుటుంబాలు కోర్టు మెట్లెక్కడానికి ప్రధాన కారణం ఆస్తి తగాదాలే. తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు తేల్చకపోవడం, లేదా ఉన్న ఆస్తి మొత్తాన్ని కేవలం కుమారుడికే కట్టబెట్టడం వల్ల వారి మరణానంతరం వివాదాలు తారాస్థాయికి చేరుతుంటాయి. అయితే తల్లిదండ్రులు తమ ఆస్తిని మొత్తం కుమారుడికే రాసిస్తే కూతుళ్లకు ఎలాంటి హక్కులు ఉండవా? భారతీయ చట్టాలు ఈ విషయంలో ఏం చెబుతున్నాయి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. తల్లిదండ్రుల ఆస్తిపై కుమార్తెలకు ఉండే హక్కులు పూర్తిగా ఆ ఆస్తి స్వభావంపై ఆధారపడి ఉంటాయి. చట్టం ప్రకారం ఆస్తులను రెండు రకాలుగా విభజిస్తారు. అందులో ఒకటి సొంత సంపాదనతో కొన్నది, పూర్వీకుల ఆస్తి.

సొంత ఆస్తి: తల్లిదండ్రుల ఇష్టమే కీలకం

తల్లిదండ్రులు తమ సొంత సంపాదనతో సంపాదించిన ఆస్తిపై వారికి సర్వహక్కులూ ఉంటాయి. దానిని వారు ఎవరికైనా ఇచ్చే పూర్తి స్వేచ్ఛ చట్టం కల్పించింది. తల్లిదండ్రులు బతికి ఉండగానే రిజిస్టర్డ్ దానపత్రం లేదా వీలునామా ద్వారా తమ స్వార్జిత ఆస్తిని పూర్తిగా కుమారుడి పేరుపై రాస్తే, సాధారణ పరిస్థితుల్లో కుమార్తె దానిపై నేరుగా హక్కు కోరలేరు.

కోర్టులో సవాల్: ఒకవేళ ఆ వీలునామా లేదా దానపత్రం మోసపూరితంగా, బలవంతంగా రాయించుకున్నా లేదా ఆ సమయంలో తల్లిదండ్రులు మానసిక సమతుల్యత కోల్పోయి ఉన్నారని నిరూపించగలిగితే కుమార్తెలు ఆ పత్రాలను న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు.

వీలునామా రాయకుండా చనిపోతే?: తల్లిదండ్రులు ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే.. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆ స్వార్జిత ఆస్తిలో కుమారుడు, కుమార్తె క్లాస్-1 వారసులుగా సమాన వాటా పొందుతారు.

వంశపారంపర్య ఆస్తి

పూర్వీకుల నుంచి సంక్రమించిన వంశపారంపర్య ఆస్తి విషయంలో నిబంధనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. హిందూ వారసత్వ (సవరణ) చట్టం – 2005 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై పుట్టుకతోనే కుమారుడికి ఎంత హక్కు ఉంటుందో, కుమార్తెకూ అంతే సమాన హక్కు ఉంటుంది. కుమార్తెకు వివాహం జరిగినంత మాత్రాన పూర్వీకుల ఆస్తిపై ఆమెకున్న హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాదు. పూర్వీకుల ఆస్తిని కుమార్తె అనుమతి లేకుండా కేవలం కుమారుడి పేరు మీద మాత్రమే బదిలీ చేయడం లేదా ఇతరులకు రాయడం చట్టవిరుద్ధం.

కొడుకు పేరుపై రిజిస్ట్రేషన్ చేసినా కోర్టుకు వెళ్లొచ్చు.

ఈ అంశంపై న్యాయవాది రవి కుమార్ భధ్యరాపుర స్పందిస్తూ.. ‘‘కేవలం సోదరుడి పేరు మీద ఆస్తి రిజిస్ట్రేషన్ అయిపోయినంత మాత్రాన ఆ వివాదం ముగిసిపోయినట్లు కాదు. వంశపారంపర్య ఆస్తిలో లేదా చట్టబద్ధమైన వాటాలో తమకు అన్యాయం జరిగిందని భావిస్తే, చట్టవిరుద్ధంగా బదిలీ అయిన ఆస్తిపై కుమార్తెలు నిర్భయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు” అని స్పష్టం చేశారు. కుటుంబంలో న్యాయపరమైన హక్కులు తెలియకపోవడం వల్లే చాలామంది మహిళలు మోసపోతున్నారు. ఆస్తి స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకుని, చట్టబద్ధమైన రక్షణలను తెలుసుకోవడం ద్వారా మహిళలు తమ న్యాయమైన వాటాను దక్కించుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us