UPI Payments: తగ్గుతున్న డెబిట్‌ కార్డుల వినియోగం.. ఈకామర్స్‌ సైట్స్‌లో సరికొత్త ట్రెండ్‌..

|

Oct 26, 2023 | 1:15 PM

ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఈకామర్స్‌ చెల్లింపుల్లో సరికొత్త ట్రెండ్ కనిపించింది. ఒకప్పుడు వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఎక్కువగా డెబిట్‌ కార్డు లేదా క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకునే వారు. కానీ ప్రస్తుతం ఈ ట్రెండులో మార్పు కనిపిస్తోంది. డెబిట్ కార్డుల వినియోగం క్రమంగా తగ్గుతూ, యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రజలు ఈ కామర్స్‌ సైట్స్‌లోనూ...

UPI Payments: తగ్గుతున్న డెబిట్‌ కార్డుల వినియోగం.. ఈకామర్స్‌ సైట్స్‌లో సరికొత్త ట్రెండ్‌..
Online Shopping
Follow us on

భారత్‌లో రోజురోజుకీ ఈ కామర్స్‌ సైట్స్‌ హవా నడుస్తోంది. ఆన్‌లైన్‌ వ్యాపారం రోజురోజుకీ పుంజుకుంటోంది. ఒకప్పుడు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించని వారు కూడా ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా పండుగల సీజన్‌లో ఈకామర్స్‌ సైట్స్ అందిస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఆన్‌లైన్‌లో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఈకామర్స్‌ చెల్లింపుల్లో సరికొత్త ట్రెండ్ కనిపించింది. ఒకప్పుడు వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఎక్కువగా డెబిట్‌ కార్డు లేదా క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకునే వారు. కానీ ప్రస్తుతం ఈ ట్రెండులో మార్పు కనిపిస్తోంది. డెబిట్ కార్డుల వినియోగం క్రమంగా తగ్గుతూ, యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)కి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రజలు ఈ కామర్స్‌ సైట్స్‌లోనూ యూపీఐ పేమెంట్స్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆర్‌బీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయి.

ఈ లెక్కల ప్రకారం గతేడాది ఈ కామర్స్‌ సైట్స్‌లో డెబిట్ కార్డుల ద్వారా 117 మిలియన్ల లావాదేవీలు నమోదుకాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఈ సంఖ్య సగానికిపై తగ్గడం విశేషం. ఈ ఏడాది డెబిట్‌ కార్డ్‌ ట్రాన్సాక్షన్‌లు 51 మిలియన్లకు పడిపోయింది. ఇక లావావేదీల మొత్తం కూడా రూ. 21,000 కోట్ల నుంచి రూ. 16,127 కోట్లకు తగ్గడం గమనార్హం. ఇదిలా ఉంటే మరోవైపు యూపీఐ పేమెంట్స్‌ మాత్రం పెరుగుతున్నాయి. యూపీఐ ద్వారా చేసిన చెల్లింపుల సంఖ్య 2.2 బిలియన్ల నుంచి 6.1 బిలియన్లకు చేరింది. తక్కువ మొత్తంలో ఉన్న ఆర్డర్స్‌ కోసం యూజర్లు యూపీఐని ఉపయోగిస్తుండగా, పెద్దం మొత్తంలో ట్రాన్సాక్షన్స్‌కి నెట్‌ బ్యాంకింగ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.

ఇదిలా ఉంటే డెబిట్ కార్డుల వినియోగం తగ్గితే, క్రెడిట్ కార్డ్‌ వినియోగం మాత్రం పెరగడం గమనార్హం. 2022 ఏప్రిల్‌లో 107 మిలియన్ల క్రెడిట్ కార్డు లావాదేవీలుగా జరగగా, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఈ సంఖ్య ఏకంగా 22 శాతం పెరిగి 131 మిలియన్లకు చేరడం విశేషం. డెబిట్‌ కార్డుల వినియోగం ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్‌లోనూ తగ్గినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో డెబిట్ కార్డుల స్వైప్‌ల సంఖ్య 213 మిలియన్ల నుంచి 132 మిలియన్లకు తగ్గింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చాలా సులభంగా ఉండడం, స్మార్ట్ ఫోన్‌తోనే సింపుల్‌గా పేమెంట్స్ చేసే వీలు ఉండడంతో డెబిట్‌ కార్డుల వినియోగం తగ్గుతున్నట్లు ఆర్థిక రంగ నిణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..