
మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది.. కేవలం రెండు వస్తువులు కొందామని సూపర్‌మార్కెట్‌కు వెళ్తాం.. కానీ తిరిగి వచ్చేటప్పుడు చేతిలో ఒక పెద్ద ట్రాలీ నిండా సామాన్లు ఉంటాయి. ఆఫర్లు చూసో, ముచ్చటపడో అవసరం లేని సాస్‌లు, కూరగాయలు కొనేసి.. ఆ తర్వాత వాటిని వాడటం మర్చిపోయి ఫ్రిజ్‌లోనే కుళ్లిపోయేలా చేస్తుంటాం. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం ఇలాగే వృథా అవుతోంది. ఈ వృథాను అరికడుతూనే, మీ బడ్జెట్ దాటకుండా స్మార్ట్‌గా గ్రోసరీ షాపింగ్ చేయడానికి ఉపయోగపడే 7 అద్భుతమైన టిప్స్ ఇవే..
చాలామందికి లిస్ట్‌లు రాయడం బోర్ కొట్టే విషయమే, కానీ ఇది వృథా ఖర్చులను ఆపడంలో ఒక మ్యాజిక్‌లా పనిచేస్తుంది. ఇంట్లో ఏమేం వస్తువులు అయిపోవచ్చాయో ఒక నోట్‌పాడ్‌లో రాసుకోండి. వీలైతే త్వరగా పాడైపోయేవి, ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి విడివిడిగా లిస్ట్ రాసి, షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఆ లిస్ట్‌కు మాత్రమే కట్టుబడి ఉండండి.
డిస్కౌంట్ వస్తోంది కదా అని ఒకేసారి ఆరు సబ్బులు లేదా ఐదు కిలోల పిండి అవసరమా? అని ఆలోచించండి. ఆఫర్ల కోసం కొనేసి, ఆ తర్వాత వాడకుండా పక్కన పడేస్తే డబ్బుతో పాటు వస్తువు కూడా వేస్ట్. కూరగాయలు, పండ్లను వారానికి ఒకసారి.. డ్రై ప్రొడక్ట్స్, పప్పు దినుసులను నెలకు ఒకసారి మాత్రమే అవసరమైన మేర కొనుగోలు చేయండి.
ప్రతి వస్తువు ప్యాకింగ్‌పై దాన్ని ఎలా నిల్వ చేయాలో రాసి ఉంటుంది. ఆ సూచనలను ఖచ్చితంగా పాటించండి. ఉదాహరణకు.. బ్రెడ్ ఎక్కువ రోజులు బయట ఉంటే పాడవుతుంది. ఇంట్లో తినేవారు తక్కువ మంది ఉంటే చిన్న బ్రెడ్ ప్యాకెట్ కొనండి. మిగిలితే ఒకటి లేదా రెండు రోజులు ఫ్రిన్‌లో పెట్టి, తినే ముందు టోస్టర్‌లో వేడి చేసుకోండి.
మార్కెట్లోకి కొత్తగా వచ్చిన చీజ్, సాస్‌లు లేదా కొత్త బ్రాండ్ ప్రొడక్ట్స్‌ను ట్రై చేయాలనుకుంటే.. మొదట అందులో దొరికే అత్యంత చిన్న సైజ్ ప్యాకెట్‌ను మాత్రమే కొనండి. అది మీకు నచ్చి, మీ డైట్‌కు సెట్ అవుతుందనుకుంటేనే తర్వాత పెద్ద ప్యాకెట్ కొనడం వల్ల అనవసరపు ఖర్చులు తగ్గుతాయి.
మనం రెగ్యులర్‌గా వాడే మసాలాలు, తృణధాన్యాలు, ఫ్లోర్ క్లీనర్స్ వంటి వస్తువులపై బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఉన్నప్పుడు కొనుగోలు చేయడం మంచి పద్ధతి. ఎందుకంటే ఇవి ఎలాగూ ఇంట్లో ప్రతి నెల వాడేవే కాబట్టి వీటి వల్ల డబ్బు బాగా ఆదా అవుతుంది.
ఖర్చులను ట్రాక్ చేయడానికి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లు బాగా ఉపయోగపడతాయి. మనం కార్డ్ స్వైప్ చేసినప్పుడు వచ్చే ఎస్ఎమ్ఎస్‌లను బట్టి బడ్జెట్‌ను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేసే యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డైరీలో రాసే అలవాటు లేనివారు ఇలాంటి యాప్స్ లేదా ఆన్‌లైన్ గ్రోసరీ స్టోర్స్ ద్వారా బడ్జెట్ లిమిట్ దాటకుండా ప్లాన్ చేసుకోవచ్చు.
వారంలో ఏ రోజు ఏ వంట చేసుకోవాలో ముందే ఒక ప్లాన్ ఉంటే, దానికి సరిపడా కూరగాయలు, సరుకులు మాత్రమే కొంటాం. దీనివల్ల అనవసరమైన పదార్థాలు కొనే ప్రసక్తే ఉండదు. వృథా కూడా సున్నా అవుతుంది.