AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!

బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!

Phani CH
|

Updated on: Jun 07, 2026 | 4:28 PM

Share

బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్లలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌లు భారీ పెట్టుబడులపై తాత్కాలిక పరిమితులు విధించాయి. లిక్విడిటీ నిర్వహణ, దిగుమతి ఒత్తిడి నియంత్రణ, మార్కెట్ స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే సాధారణ ఎస్‌ఐపీ ఇన్వెస్టర్లపై ఈ ఆంక్షల ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతున్న వేళ.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణగా భావించే పసిడి వైపు పరుగులు తీస్తున్నారు. స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు, అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ కమోడిటీ మార్కెట్‌లో బంగారం సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో దేశీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో ఎన్నడూ లేని విధంగా సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా పెరుగుతున్న గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు బ్రేక్ వేస్తూ.. దేశంలోని ప్రముఖ ఫండ్ హౌస్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీనికి గల కారణాలేంటి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. మొదట జూన్ 4, 2026న HDFC మ్యూచువల్ ఫండ్ తన గోల్డ్ ఈటీఎఫ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoF)లపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకోగా.. మరుసటి రోజు ఉదయమే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్(ICICI Prudential), నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్‌లు కూడా అదే బాట పట్టాయి. కేవలం రెండు రోజుల్లోనే మూడు దిగ్గజ ఫండ్ హౌస్‌లు ఒకేసారి నిధుల ప్రవాహాన్ని నియంత్రించడానికి పూనుకోవడం మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, HDFC మ్యూచువల్ ఫండ్ తన గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లో భారీ పెట్టుబడులపై మాత్రమే ఈ పరిమితులు విధించింది. లిక్విడిటీని సమర్థవంతంగా నిర్వహించేందుకు, అసెట్ ట్రాకింగ్‌లో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దీని గురించి సామాన్య ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఫండ్‌లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టేవారిపై ఈ కొత్త ఆంక్షల ప్రభావం ఏమాత్రం ఉండదు. అయితే, ఫండ్ హౌస్‌లు ఇప్పుడు సడెన్‌గా ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాయి.? సాధారణంగా ఒక పథకంలోకి నిధులు వెల్లువలా వచ్చి చేరినప్పుడు వాటిని నిర్వహించడం ఫండ్ మేనేజర్లకు సవాలుగా మారుతుంది. అయితే, ఈ తాత్కాలిక బ్రేక్స్ వెనుక కేవలం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న బలమైన కారణాలు కూడా ఉన్నాయి. భారతదేశం తన బంగారంలో అత్యధిక భాగాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి ఇన్వెస్టర్ల నిధులు విపరీతంగా పెరిగినప్పుడు, ఫండ్ హౌస్‌లు దానికి సమానమైన భౌతిక బంగారాన్ని మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది దేశంలోకి బంగారం దిగుమతులను మరింత పెంచి, తద్వారా దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD)పై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తుంది. విలువైన విదేశీ మారక ద్రవ్యం Gold దిగుమతులకే ఎక్కువగా ఖర్చైతే అది రూపాయి విలువ పతనానికి కారణమవుతుంది. అందుకే దేశీయ మార్కెట్లలో బంగారం కొనుగోళ్లను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని కూడా 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచింది. వీటన్నింటికీ తోడు.. ప్రస్తుతం బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నందున, సాధారణ ఇన్వెస్టర్లు ఆవేశపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఫండ్ హౌస్‌లు ఈ హెచ్చరికతో కూడిన చర్యలు చేపట్టాయి. ఇక ఈ కొత్త నిబంధనల ప్రకారం.. నిప్పన్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సంస్థలు పెద్ద సంస్థాగత, కార్పొరేట్ ఇన్వెస్టర్ల నుండి వచ్చే రూ.25 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన డైరెక్ట్ సబ్‌స్క్రిప్షన్లను పూర్తిగా నిలిపివేశాయి. ఇక సాధారణ లేదా రిటైల్ ఇన్వెస్టర్ల విషయానికి వస్తే.. ప్రతి పాన్ కార్డుపై నెలకు గరిష్టంగా రూ. 10 లక్షల వరకు మాత్రమే Lumpsum పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ మొత్తాలను ప్రస్తుతం స్వీకరించడం లేదు. నిప్పన్ ఇండియా ఫండ్‌లో అయితే రెగ్యులర్ ఎస్ఐపీ, ఎస్టీపీలకు కూడా రోజుకు ₹50,000 పరిమితిని విధించారు. అయితే, ఈ తాత్కాలిక పరిమితుల వల్ల సాధారణ పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నెలవారీగా చిన్న మొత్తాల్లో సాగే సాధారణ ఎస్ఐపీ (SIP) హోల్డర్లపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు, వారి పెట్టుబడులు ఎప్పటిలాగే సాగుతాయి. అలాగే స్టాక్ ఎక్స్ఛేంజ్ వేదికగా మీ డీమ్యాట్ ఖాతా ద్వారా గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను కొనడం లేదా అమ్మడం యథావిధిగా చేసుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు సర్దుకుని, సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ తాత్కాలిక నిబంధనలను మళ్లీ సడలించే అవకాశం ఉందని ఫండ్ హౌస్‌లు స్పష్టం చేశాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలంటే పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉండటం చాలా ముఖ్యం. మీ మొత్తం పెట్టుబడుల్లో 5 నుంచి 10 శాతం వరకు బంగారంపై కేటాయించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లు పతనమైనప్పుడు మీ సంపద ఆవిరి కాకుండా ఈ సింపుల్ స్ట్రాటజీ కాపాడుతుంది. ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నుంచి రక్షణ కల్పించడంలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు ఈ నిర్ణయాన్ని మార్కెట్ క్రమబద్ధీకరణలో భాగంగా ఒక సానుకూల చర్యగా చూడాలంటున్నారు నిపుణులు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ధరల్లో అస్థిరత రాకుండా ఇది అడ్డుకుంటుంది. స్వల్పకాలిక మార్పులను చూసి ఆందోళన చెందకుండా, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపైనే దృష్టి పెట్టండని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. “మొత్తానికి, ఒకవైపు అంతర్జాతీయ అనిశ్చితి, మరోవైపు సురక్షిత పెట్టుబడిగా బంగారంపై ఉన్న విశ్వాసం” ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడటానికే ఫండ్ హౌస్‌లు ఈ కఠిన నిర్ణయాలను తీసుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను, రూపాయి విలువను కాపాడుకోవాల్సిన బాధ్యతలో భాగంగానే ఈ తాత్కాలిక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కాబట్టి, ఆందోళన చెందాల్సిన పనిలేదు.. సాధారణ ఇన్వెస్టర్లు, నెలవారీ ఎస్‌ఐపీ (SIP) చేసేవారు యథావిధిగా తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఏదేమైనా, పెట్టుబడి ఏదైనా సరే.. ఆవేశంతో కాకుండా, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను విశ్లేషించుకుని, మీ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవడమే తెలివైన పెట్టుబడిదారుడి లక్షణం. కాబట్టి, పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Buchi Babu: జాన్వీని రోల్ పై విర్శలు.. వివరణ ఇచ్చిన బుచ్చి

హస్కీ వాయిస్‌తో తియ్యగా మాట్లాడి.. కోట్లలో ముంచేసిందిగా

హీరోయిన్ కాదు.. డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న లారెన్స్ వారసురాలు రాఘవి

Ebola: ఎబోలా డేంజర్ బెల్స్! మన దేశంలో పరిస్థితి ఏమిటి?

Follow Us