Ebola: ఎబోలా డేంజర్ బెల్స్! మన దేశంలో పరిస్థితి ఏమిటి?
హైదరాబాద్‌లో ఎబోలా అనుమానిత లక్షణాలతో ఇద్దరు విదేశీయులను ఐసోలేషన్‌లో ఉంచడంతో ఆందోళన నెలకొంది. సూడాన్‌కు చెందిన విద్యార్థి సహా ఇద్దరి నమూనాలను పరీక్షల కోసం పంపించారు. ఇదే సమయంలో కాంగో, ఉగాండాలో బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. అయితే తుది పరీక్ష ఫలితాలు వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
కరోనా రోజులు గుర్తున్నాయా? ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ భారతీయులను వెంటాడుతూనే ఉన్నాయి. చైనాలోని వుహాన్ నుంచి కేరళకు వచ్చిన ఓ వైద్య విద్యార్థిలో మొదటిసారి కరోనా వైరస్ బయటపడినప్పుడు… అది దేశాన్ని ఎంత పెద్ద విపత్తులోకి నెట్టబోతోందో ఎవరూ ఊహించలేదు. కానీ కొన్ని నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎబోలా ముప్పు పెరుగుతున్న వేళ… మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోందా? ప్రపంచాన్ని ఒకప్పుడు వణికించిన ప్రాణాంతక వైరస్ ఇప్పుడు మళ్లీ దాడికి సిద్ధమవుతోందా? హైదరాబాద్ నగరం మే మొదటి వారంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది! కరోనా మహమ్మారి భీభత్సాన్ని ఇంకా మరువకముందే… ప్రపంచాన్ని వణికించే మరో ప్రాణాంతక వైరస్ భాగ్యనగరంలోకి అడుగుపెట్టిందా? సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ యగౌచ్ అహ్మద్ అనే 36 సంవత్సరాల యువకుడు ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నగరంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో అతను చదువుకుంటున్నట్లు సమాచారం. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతడికి సాధారణ వైద్య పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్న సమయంలో, అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే మహమ్మద్ అహ్మద్ శరీరంలో ఎబోలా వైరస్ లక్షణాలు కనిపించాయి. తీవ్రమైన జ్వరం, అలసటతో అతను బాధపడుతున్నాడు. అంతే.. ఎయిర్‌పోర్ట్ అధికారులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, రాష్ట్ర ఆరోగ్య శాఖకు సమాచారం అందించారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన అంబులెన్స్‌లో అతడిని నేరుగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. మహమ్మద్ అహ్మద్‌తో పాటు ప్రయాణించిన, లేదా అతనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తిని కూడా అధికారులు గుర్తించారు. ఆ రెండో వ్యక్తిని కూడా తక్షణమే ఐసోలేషన్‌లోకి తీసుకుని వైద్య పరీక్షలు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఇద్దరికీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ‘సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మొలెక్యూలర్ బయాలజీ’కి పంపించారు. అక్కడి ప్రాథమిక పరిశీలనల అనంతరం, ఈ నమూనాలను పూణెలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ’ కు పంపనున్నారు. భారత్‌లో ఇలాంటి ప్రమాదకరమైన వైరస్‌లను ధృవీకరించే ఈ ల్యాబ్ నుంచి తుది ఫలితాలు రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ఈ ఇద్దరినీ ఎవరితో కలవనివ్వకుండా క్వారంటైన్‌లోనే ఉంచుతారు. మధ్య ఆఫ్రికాలోని కాంగోలో కొన్ని వారాల్లోనే 900కిపైగా అనుమానిత ఎబోలా కేసులు, 223 మరణాలు నమోదయ్యాయి. పొరుగు దేశమైన ఉగాండాలో కూడా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం వ్యాపిస్తున్న బుండిబుగ్యో రకం ఎబోలాకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ వైరస్ బారిన పడిన వారిలో 30 నుంచి 50 శాతం మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎబోలా వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి మనుషులకు సోకితే రోగి చెమట, లాలాజలం, రక్తం లేదా శరీర ద్రవాల ద్వారా మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. సమయానికి చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా ఎక్కువ. ఈశాన్య కాంగోలో అధికారికంగా కేసులు నమోదయ్యేలోపే ఒకటి రెండు నెలల నుంచి వైరస్ నిశ్శబ్దంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. దీంతో అసలు బాధితుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉండొచ్చన్న అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాయుధ ఘర్షణలు, అస్థిర పరిస్థితుల కారణంగా ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో వైద్య పరీక్షలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. బాధితులకు సరైన వైద్యం కూడా అందడం లేదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎబోలాతో మరణించిన వారికి వైద్య సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించడాన్ని స్థానికులు సంప్రదాయాల పేరుతో వ్యతిరేకిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఐసోలేషన్ కేంద్రాల నుంచి రోగులు పారిపోతున్నారు. వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తున్నది భయం, అవగాహన లోపం, ఆరోగ్య వ్యవస్థల బలహీనత. ఎబోలాను అడ్డుకోవడంలో ఆఫ్రికా దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా ప్రమాద సంకేతాలను పంపిస్తున్నాయి. కరోనా తర్వాత ప్రపంచం మరోసారి పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? లేక ఎబోలాను ఈ దశలోనే నియంత్రించగలదా?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముందు చక్రం ఊడి కుప్పకూలిన విమానం
Weather Update: గెట్ రెడీ.. వరుణుడు వచ్చేస్తున్నాడు! తెలుగు రాష్ట్రాలకు వర్షాల సందడి!
రూ. 2 లక్షల విలువైన పరుపులు ఇచ్చి.. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన తండ్రీ కొడుకులు!
ఏఐ గురువులకు ఫుల్ డిమాండ్.. ఒక్క క్లాస్ చెబితే రూ. 23 లక్షల ఫీజు
ఇదేం పోయే కాలంరా.. కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్
దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్.. కారణం ఇదే
ఐఆర్సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్
చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి..
రోడ్డుపై కరెన్సీ విసిరేసి.. ఓ రేంజ్లో పోలీస్ దొంగా ఛేజింగ్
అత్తని బుట్టలో కూర్చోబెట్టి.. నెత్తిన పెట్టుకుని కోడలి పాదయాత్ర

