Crypto News: ఈ రోజుల్లో చాలా మంది క్రిప్టో కరెన్సీల వెనుక పడుతున్నారు. ఈ క్రమంలో వాటికి సైబర్ ముప్పు(Cyber Crimes) కూడా భారీగానే పెరుగుతోంది. దీనిని అదిగమించేందకు క్రిప్టో కంపెనీలు(Crypto Companies) నయా ప్లాన్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా.. క్రిప్టో కరెన్సీ సంస్థలు యూకే సైబర్ క్రైమ్ పోలీసులకు భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. తమ సంస్థలలో చేరితే ఇప్పుడు వారు అందుకుంటున్న జీతాలకంటే రెండింతలు లేదా మూడింతలు ఎక్కువ వేతనాన్ని ఇస్తామని భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ కారణంగా అనుభవజ్ఞులైన సైబర్ క్రైమ్ ఆఫీసర్లను కోల్పోవాల్సి వస్తోందని యూకే నేషనల్ పోలీసు చీఫ్ కౌన్సిల్ తెలిపింది. పోలీసింగ్ లేదా లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో నిపుణులైన 15 మందికి పైగా ఆఫీసర్లు ప్రస్తుతం ప్రముఖ క్రిప్టో కంపెనీల్లో పనిచేస్తున్నట్లు NPCC అంచనావేసింది. రానున్న 18 నెలల కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగవచ్చని.. అందువల్ల తమకు సైబర్ క్రైమ్ నిపుణుల కొరత ఏర్పడనుందని వెల్లడించింది.
అనుభవజ్ఞులైన సైబర్ క్రైమ్ ఆఫీసర్లు, ఉద్యోగులను కోల్పోవడం తమకు అతిపెద్ద సమస్యగా మారనుందని NPCC సైబర్ క్రైమ్ యూనిట్ హెడ్ ఆండ్రూ గౌల్డ్ అన్నారు. ప్రైవేట్ రంగంలో వీరి నైపుణ్యాలకు భారీగా డిమాండ్ ఉందని.. రెండు నుంచి మూడింతలు ఎక్కువగా కంపెనీలు ప్యాకేజీలను ఆఫర్ చేస్తుండటంతో ఆఫీసర్లు క్రిప్టో కరెన్సీలకు చెందిన కంపెనీల్లోకి మారుతున్నారని తెలిపింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్టాఫ్‌ను నియమించుకుంటోన్న సంస్థల్లో అమెరికాలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజీ అయిన కాయిన్‌బేస్ గ్లోబల్ ఇంక్, క్రిప్టో రీసెర్చ్ సంస్థ చైనాలిసిస్ ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజీ అయిన బినాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ కూడా యూకే ఫైనాన్సియల్ కండక్ట్ అథారిటీకి చెందిన మాజీ అధికారిని తన రెగ్యులేటరీ పాలసీకి డైరెక్టర్‌గా నియమించుకుంది. తమ కస్టమర్ల సంపదను సురక్షితంగా, భద్రంగా ఉంచేందుకు వారు సమగ్రమైన పాత్ర పోషిస్తారని కాయిన్‌బేస్ అధికార ప్రతినిధి అన్నారు.
2018 నుంచి సుమారు 250 మందికిపైగా సైబర్ క్రైమ్ నిపుణులకు ప్రభుత్వ ఫండ్‌తో సైబర్ సెక్యూరిటీల విషయంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్‌లో వీరికి క్రిప్టో కరెన్సీల హ్యాక్ వంటి నేరాలను ఎలా విచారించాలో నేర్పించారు. కానీ.. ప్రస్తుతం పెద్ద క్రిప్టో ఎక్స్చేంజీలన్ని శిక్షణ పొందిన సైబర్ నిపుణులను భారీ ఆఫర్లతో ఆకర్షించుకుంటున్నాయి. 2018 నుంచి ఎక్స్చేంజీలకు కూడా హ్యాకర్ల నుంచి ముప్పు పెరిగిన తరుణంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో డిజిటల్ సెక్యూరిటీలో అత్యధికంగా క్వాలిఫై అయిన నిపుణుల అవసరం క్రిప్టో కరెన్సీ కంపెనీలకు పెరిగింది. ఈ చర్యల వల్ల క్రిప్టో ట్రేడింగ్ మరింత సురక్షితం కానుందని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
RBI On Coronavirus: కరోనాతో భారీగా ఆర్ధిక నష్టం.. కోలుకోవాలంటే 12 ఏళ్లు పడుతుందంటున్న ఆర్బీఐ