Credit card: భారీగా పెరిగిన క్రెడిట్ కార్డ్ వినియోగం.. ఆర్బీఐ నివేదికలో ఆసక్తికర విషయాలు..
దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించినట్లు ఆర్బీఐ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో క్రెడిట్ కార్డు వినియోగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు..
దేశంలో క్రెడిట్ కార్డు వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. బ్యాంకులు సులభంగా క్రెడిట్ కార్డులను ఇస్తుండడం. ఈ కామర్స్ సంస్థలు రకరకాల ఆఫర్లను అందిస్తుండడంతో వీటి వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం ఏకంగా 25 శాతం పెరగడం విశేషం. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదలచేసిన నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
గడిచిన ఆరు నెలల్లో అత్యధిక పెరుగుదల ఇదే కావడం విశేషం. 2024-25 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో చాలా బ్యాంకులు అధిక స్లిపేజ్‌లను చూసినప్పటికీ, ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా ఖర్చు వృద్ధి 20 శాతానికి మించిపోయింది. ఆర్బీఐ లెక్కల ప్రకారం సెప్టెంబర్ నెలలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగినట్లు తేలింది. పండుగ సీజన్ కావడం, ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు అందించడమే ఇందుకు కారణమని పలువురు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయమై కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ హెడ్ సౌరభ్ భలేరావ్ మాట్లాడుతూ.. ‘గతేడాదితో పోల్చితే ఈసారి క్రెడిట్ కార్డు వినియోగం పెరిగింది. పండుగల నేపథ్యంలో ఆఫర్లు ఉండడం, నెలవారీ చెల్లింపులు వటి ప్రమోషనల్ స్కీమ్స్ కారణంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువైంది. అక్టోబర్‌లో కూడా పండుగ సీజన్ కావడంతో క్రెడిట్ కార్డు వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు.
పండుగ సీజన్ డిమాండ్ భారతదేశ ఆర్థిక వృద్ధికి మిశ్రమ సంకేతాలను అందజేస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పేందుకు ఈ సూచికలు నిదర్శనమని, అనేక హై-ఫ్రీక్వెన్సీ సూచికలు ఆరోగ్యకరమైన ఆర్థిక పనితీరును సూచిస్తూ బలమైన వృద్ధిని చూపుతాయని దాస్ పేర్కొన్నారు.
దేశంలో క్రెడిట్ కార్డులను జారీ చేసే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సంబంధించి సెప్టెంబర్‌లో ఏకంగా రూ. 52,226.59 కోట్లు ఖర్చు చేయడం విశేషం. గతేడాదితో పోల్చితే ఇది 35 శాతం అధికం. ఇక ఎబీఐ విషయానికొస్తే.. ఎస్‌బిఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్‌బిఐ కార్డ్) లావాదేవీలు 11 శాతం పెరిగి రూ.27,714.7 కోట్లకు, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ వ్యయం 24 శాతం పెరిగి రూ.31,457 కోట్లకు, యాక్సిస్ బ్యాంక్ 15.1 శాతం వృద్ధితో రూ.18,721.9 కోట్లకు చేరాయి. దేశంలో మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 14 శాతం పెరిగి 106.11 మిలియన్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫసీ బ్యాంక్ 22.4 మిలియన్ కార్డులను, ఎస్‌బీ కార్డు 19.5 మిలియన్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 17.56 మిలియన్లు, యాక్సిస్ బ్యాంక్ 14.79 మిలియన్ కార్డులను జారీ చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..