మీ క్రెడిట్ కార్డును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే దాన్ని బ్లాక్ చేయాల్సిందే. లేదంటే దొంగిలించిన వ్యక్తులు వాటిని వాడే ఛాన్స్ ఉంది. క్రెడిట్ కార్డు కోల్పోయినప్పుడు అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. తరువాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముందుగా, మీరు క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంకును సంప్రదించాలి. కాల్ లేదా ఇమెయిల్ చేసి, కార్డు పోయిన సంగతి తెలియజేయాలి. అనంతరం వెంటనే కార్డును బ్లాక్ చేయాలి. ఎందుకంటే మీరు బ్యాంకుకు తెలియజేసిన రోజు లేదా సమయం నుంచి క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు.
ఈ రోజుల్లో అన్ని కార్డులు కాంటాక్ట్‌లెస్‌గా వస్తున్నాయి. అంటే, లావాదేవీల కోసం మీరు పిన్ నమోదు చేయనవసరం లేదు. POS మెషిన్‌పై వెంటనే చెల్లింపులు చేసేలా తయారు చేశారు. బ్యాంకుతో మాట్లాడి కార్డును బ్లాక్ చేయకపోతే, అది దుర్వినియోగం కావచ్చు. బ్యాంక్ ఫోన్ నంబర్ లేకపోతే.. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో సంబంధిత వివరాలు ఉంటాయి. బ్యాంకుకు ఫిర్యాదు చేయడానికి ముందు, మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
కార్డు నంబర్‌ను అడుగుతారు. కాబట్టి ముందుగానే కార్డు నంబర్‌ను నోట్ చేసి పెట్టుకుంటే మంచింది.
క్రెడిట్ కార్డు దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న ఖచ్చితమైన తేదీని బ్యాంకుకు అందించాలి.
లావాదేవీ జరిగిన చివరి తేదీ, అలాగే లావాదేవీ ఎంత మొత్తంలో చేశారు అని అడుగుతారు కాబట్టి వాటిని గుర్తుంచుకోవాలి.
వెంటనే ఇలా చేయండి..
కార్డు దొంగిలించబడినా లేదా పోయినా చింతించకండి. దాన్ని వెంటనే బ్లాక్ చేయండి. మీరు మొబైల్ యాప్ నుంచి కూడా ఈ పనిని చేసుకోవచ్చు. బ్యాంక్ మొబైల్ యాప్‌ను ఉంపయోగించి కార్డును బ్లాక్ లేదా అన్‌బ్లాక్ చేసే సదుపాయం అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు మొబైల్ నుంచి కార్డును బ్లాక్ చేయలేకపోతే, బ్యాంక్‌కు కాల్ చేసి బ్లాక్ చేయండి. ఈ పని పూర్తయ్యే వరకు దాని స్టేట్‌మెంట్‌ని జాగ్రత్తగా ఉంచుకోండి.
అనంతరం ఏం చేయాలంటే..
బ్యాంకుకు ఫిర్యాదు చేసిన తర్వాత, మీ కార్డు బ్లాక్ చేస్తారు లేదా లావాదేవీలు జరగకుండా స్తంభింపజేస్తారు. అప్పుడు పాత కార్డుకి బదులుగా బ్యాంక్ మీకు కొత్త కార్డును జారీ చేస్తుంది. ఫిర్యాదు చేసిన తర్వాత, మీ ఖాతా రద్దు కాదు. అదే ఖాతా ఆధారంగా కొత్త కార్డు జారీ చేస్తారు. మీరు మీ క్రెడిట్ కార్డుపై రుణం లేదా EMI ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, అప్పుడు క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ, మీరు మీ కార్డును కోల్పోయరన్న సాకుతో బిల్లులు లేదా రుణాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తే, మీ స్కోరు ప్రభావితం కావచ్చు.
బ్యాంక్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి..
మీరు మీ ఇల్లు లేదా నగరాన్ని మార్చినట్లయితే, మీ క్రెడిట్ కార్డ్‌లో వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. మీ కొత్త చిరునామాను త్వరగా మార్చుకునేలా చూసుకోవాలి. ప్రస్తుతం కార్డుల డెలివరీ కొరియర్ ద్వారా జరుగుతుంది. ఒకవేళ మీరు ఇల్లు మారినట్లయితే, చిరునామాను బ్యాంక్‌లో అప్‌డేట్ చేయకపోతే సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు KYC కూడా చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను కొత్త అడ్రస్‌తో తీసుకోవడం మంచిది. మీరు చిరునామాను అప్‌డేట్ చేయకపోతే, ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వొద్దు
కార్డును కోల్పోయిన తరువాత మీకు కాల్స్ వస్తే.. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకండి. సైబర్ నేరగాళ్లు PIN లేదా CVV సమాచారాన్ని పొందడానికి మిమ్మల్ని మోసగించే ఛాన్స్ ఉంది. ఇలాంటి కాల్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డ్‌లను ట్రాక్ చేయండి. మీ మొబైల్ ఫోన్‌లో మోసపూరిత కాల్స్‌ను గుర్తించేం సెటప్ చేసుకోవడం చాలా మంచింది. మీ వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని అడిగే ఇమెయిల్‌లకు ఎలాంటి సమాధానం ఇవ్వొద్దు.
ఏరియాను సెట్ చేయాలి..
క్రెడిట్ కార్డులను ఉపయోగించే ఏరియాలను ఎంచుకునే ఛాన్స్ ఉంది. అంటే, కార్డును ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా రాష్ట్రంలో మాత్రమే ఉపయోగించవచ్చు. కావాలంటే మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు లేదా ఆపివేయవచ్చు. ఇది పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది. ఈ చిట్కాలను ఉపయోగించి మీ కార్డు వినియోగాన్ని సురక్షితంగా చేసుకోవచ్చాు. మీ కార్డు పోయినా.. దాని దుర్వినియోగాన్ని నివారించవచ్చు.
Also Read: Best Earphones: మీరు ఇయర్స్‌ఫోన్ కొంటున్నారా.? రూ.1000 కంటే తక్కువ ధరల్లో మంచి హెడ్‌ఫోన్స్ ఇవే..!