
నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ అనేది సామాన్యుడి జీవితంలో ఒక భాగమైపోయింది. షాపింగ్ నుండి అత్యవసర అవసరాల వరకు క్రెడిట్ కార్డ్ ఆసరాగా నిలుస్తోంది. అయితే ఒకవేళ క్రెడిట్ కార్డ్ హోల్డర్ అకస్మాత్తుగా మరణిస్తే.. ఆ కార్డ్ మీద ఉన్న బకాయిల పరిస్థితి ఏమిటి? ఆ అప్పును కుటుంబ సభ్యులు తీర్చాలా? బ్యాంకు ఆ రికవరీని ఎలా చేస్తుంది? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. క్రెడిట్ కార్డ్ అనేది ఎటువంటి పూచీకత్తు లేని అప్పు. అంటే కార్డ్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఎటువంటి ఆస్తులను గ్యారెంటీగా పెట్టుకోవు. వ్యక్తి మరణించినప్పుడు, అన్‌సెక్యూర్డ్ రుణాల నిబంధనలే దీనికి కూడా వర్తిస్తాయి.
సాధారణంగా క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణించినప్పుడు ఆ బకాయిలను చెల్లించాల్సిన చట్టపరమైన బాధ్యత వారి వారసుల మీద లేదా కుటుంబ సభ్యుల మీద ఉండదు. హోల్డర్ మరణించినట్లు డెత్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత బ్యాంకు వారిని అప్పు కట్టమని వేధించే హక్కు లేదు.
కుటుంబ సభ్యులు చెల్లించకపోయినా బ్యాంకు తన బకాయిల కోసం ఇతర మార్గాలను వెతుకుతుంది:
ఆస్తుల విక్రయం: మరణించిన వ్యక్తి పేరు మీద ఏదైనా ఆస్తులు ఉంటే వాటి ద్వారా వచ్చే ఆదాయంతో అప్పును సర్దుబాటు చేసుకోవచ్చు.
బ్యాంకు నిధులు: మరణించిన వ్యక్తి ఖాతాలో ఉన్న నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ఇతర పొదుపు పథకాల నుండి బ్యాంకులు తమ బకాయిలను రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది.
వారసుల నుంచి క్లెయిమ్: ఒకవేళ మరణించిన వ్యక్తి ఆస్తిని వారసులు చట్టబద్ధంగా పొందితే, ఆ ఆస్తి విలువ మేరకు అప్పు తీర్చమని బ్యాంకులు వారిని అడగవచ్చు.
మరణించిన వ్యక్తి పేరు మీద ఎటువంటి ఆస్తులు లేకపోయినా బ్యాంకులో నగదు నిల్వలు లేకపోయినా.. అప్పుడు బ్యాంకుకు వేరే మార్గం ఉండదు. అటువంటి పరిస్థితిలో ఆ అప్పును మొండి బకాయిగా పరిగణించి బ్యాంకులు దానిని రద్దు చేస్తాయి.
బ్యాంకుకు సమాచారం: కార్డ్ హోల్డర్ మరణించిన వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించి కార్డును బ్లాక్ చేయించాలి. లేదంటే పెనాల్టీలు, వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి.
డెత్ సర్టిఫికేట్: అధికారికంగా డెత్ సర్టిఫికేట్ కాపీని బ్యాంకులో సమర్పించి, అప్పు సెటిల్మెంట్ గురించి మాట్లాడాలి.
యాడ్-ఆన్ కార్డ్స్: ఒకవేళ మరణించిన వ్యక్తి కార్డుపై కుటుంబ సభ్యులు యాడ్-ఆన్ కార్డులు వాడుతుంటే, ప్రధాన కార్డ్ హోల్డర్ మరణంతో ఆ కార్డులు కూడా చెల్లుబాటు కావు.
క్రెడిట్ కార్డ్ అప్పు అనేది వ్యక్తిగత బాధ్యత మాత్రమే. ఆస్తులు లేని పక్షంలో కుటుంబ సభ్యులపై ఆ భారం పడదు. అయితే, బ్యాంకులు తమ బకాయిల కోసం మరణించిన వ్యక్తి యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుండి రికవరీ చేయడానికి ప్రయత్నించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.