
Underwater Road, Rail Tunnel: భారతదేశంలో రైళ్లు, వాహనాలు నీటి అడుగున నడపడానికి ఇప్పుడు మార్గం సుగమం అవుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అస్సాంలో ఒక చారిత్రాత్మక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కింద దేశంలో మొట్టమొదటి రోడ్డు, రైలు సొరంగం బ్రహ్మపుత్ర నది కింద నిర్మించనున్నారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో రెండవ రోడ్డు, రైలు మార్గాన్ని నీటి అడుగున ఏర్పాటు చేయనుంది.
జాతీయ రహదారి 715 లోని నుమాలిఘర్- NH-15 లోని గోహ్‌పూర్ మధ్య దూరం ప్రస్తుతం దాదాపు 240 కిలోమీటర్లు. సిలిఘాట్ సమీపంలోని కాలియాభంభోరా రోడ్డు వంతెన ద్వారా ప్రయాణించడానికి దాదాపు ఆరు గంటలు పడుతుంది. ఈ మార్గంలో వాహనాలు కాజీరంగ జాతీయ ఉద్యానవనం, విశ్వనాథ్ పట్టణం గుండా వెళ్ళవలసి ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ కింద 15 కిలోమీటర్ల సొరంగం ఈ ప్రయాణాన్ని తగ్గించడమే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. గంటల పాటు ప్రయాణించే బదులు నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేసుకోవచ్చంటున్నారు అధికారులు.
ఇది కూడా చదవండి: రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు.. పిల్లల కోసం బెస్ట్ ప్లాన్!
ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్-కన్‌స్ట్రక్షన్ (EPC) నమూనాపై అమలు చేస్తారు. ఈ సొరంగం అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైనది కావడంతో పాటు ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది. రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో వేగవంతమైన అభివృద్ధికి దారితీస్తుంది.
ఈ ప్రాజెక్ట్ అస్సాంలోని ప్రధాన ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ కేంద్రాలను అనుసంధానిస్తుంది. ఇది 11 ఆర్థిక కేంద్రాలు, 3 సామాజిక కేంద్రాలు, 2 పర్యాటక గమ్యస్థానాలు, 8 లాజిస్టిక్స్ నోడ్‌లను అనుసంధానించాలని యోచిస్తోంది. ఇది 4 ప్రధాన రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 లోతట్టు జలమార్గాలతో మెరుగైన బహుళ-మోడల్ ఏకీకరణను నిర్ధారిస్తుంది. ప్రయాణీకులు, వస్తువుల రవాణాకు సులభతరం అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి