
మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడేందుకు రంగం సిద్దమైంది. గత కొద్ది రోజులుగా రాగి ధరలు ఆకాశాన్నంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు దిశగా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే కాపర్ ధర టన్నుకు 14 వేల డాలర్ల మార్కును క్రాస్ చేసింది. కాపర్‌పై అమెరికా భారీగా సుంకాలు విధించనుందనే వార్తల క్రమంలో వీటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్లపై కూడా పడుతుండగా.. భారతదేశంపై కూడా పడుతోంది. రాగిని డేటా సెంటర్లతో పాటు ఎలక్ట్రానిక్స్, నిర్మాణం, టెలికాం, వ్యవసాయం వంటి రంగాల్లో వినియోగిస్తున్నారు. దీంతో ఈ రంగాలపై ధరల పెంపు ప్రభావం పడుతోంది. దీంతో ఈ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో దేశంలో పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈవీ వెహికల్స్‌లో రాగిని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీంతో ఈవీ వాహనాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఒక సాధారణ పెట్రోల్, డీజిల్ కారు తయారీకి 20 నుంచి 25 కిలోల రాగి అవసరం అవుతుండగా.. ఈవీ కారుకు 80 నుంచి 85 కిలోల అవసరం పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ కారు ధర రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈవీ కార్ల ధరలు రూ.30 నుంచి రూ.40 వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఎలక్ట్రిక్ బస్సు ధరలు కూడా పెరగనున్నాయి. కాపర్ ధరలు పెరగడం వల్ల కంపెనీలపై భారం పడుతోంది. ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు కంపెనీలు సమాయత్తం అవుతున్నాయి. ఇక ఇళ్లల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో రాగిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో వీటి ధరలు పెరగనున్నాయి. 1.5 టన్ స్ల్పిట్ ఏసీ ధర రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పెరగొచ్చు. ఇక డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు పెరగొచ్చు. ఈ నెలలోనే పలు కంపెలు ధరలను పెంచేందుకు సిద్దమవుతున్నారు. మరో కంపెనీలు వచ్చే త్రైమాసికంలో పెంపునకు సిద్దమవుతున్నాయి. ఇక వ్యవసాయ రంగంపై కూడా దీని ప్రభావం పడనుంది. పండ్లు పాడవ్వకుండా ఉపయోగించే కాపర్ సల్పేట్ ధరలు పెరగనున్నాయి. ఇక ట్రాన్స్‌ఫార్మర్లు, మోటాళ్లు, ఎలివేటర్ల వంటి పరికరాల ధరలు కూడా పెరగనున్నాయి. కొన్ని కంపెనీలు రాగి ధరలు పెరగడంతో అల్యూమినియంను వాడుతున్నాయి.