Convert Petrol Scooter into Electric: ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అనేక స్టార్టప్‌లు దేశంలో రూపుదిద్దుకొంటున్నాయి. ఈ-వాహనాల విక్రయాలను ప్రోత్సహించడానికి, డీలర్లకు, కస్టమర్లకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. అయితే బెంగళూరుకు చెందిన స్టార్టప్‌లు పెట్రోల్ స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చే పనిలో నిమగ్నమయ్యాయి. అంటే, మీరు కొత్త ఈ-స్కూటర్ కొనాల్సిన అవసరం లేకుండానే మీ పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చేసుకోవచ్చన్నమాట. ఆ వివరాలేంటో చూద్దాం..
రైడ్-షేరింగ్ స్టార్టప్ కంపెనీ బౌన్స్ బెంగళూరులో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కంపెనీ ఏలాంటి పెట్రోల్ ఇంజిన్ స్కూటర్‌నైనా ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చేస్తుంది. దీని కోసం కంపెనీ కేవలం రూ. 20 వేల రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది. బౌన్స్ కంపెనీ ఇప్పటివరకు వెయ్యికి పైగా పాత స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీతో పాత స్కూటర్‌లో రెట్రోఫిట్ కిట్‌ను ఉంచుతుంది. ఇది స్కూటర్‌లో ఇన్‌స్టాల్ చేసే బ్యాటరీ కిట్ అన్నమాట. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 65 కిమీ వరకు నడుస్తుంది. ఈ కిట్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ధృవీకరించబడిందని కంపెనీ వెల్లడించింది.
సేవా కేంద్రాన్ని కూడా..
పైలట్ ప్రాజెక్ట్ గా పాత సాంప్రదాయ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చడం ప్రారంభించినట్లు బౌన్స్ సహ వ్యవస్థాపకుడు వివేకానంద హల్లెకరే తెలిపారు. పెట్రోల్ స్కూటర్లను ఎలక్ట్రిక్‌గా మార్చే ప్రక్రియ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారీ మార్కెట్ ఉందని తెలిపారు. ఈ స్కూటర్ యజమానుల కోసం కంపెనీ తరపున సేవా కేంద్రాలను కూడా ప్రారంభిస్తోంది. బౌన్స్ కంపెనీ తరువాత ఇతర కంపెనీలు కూడా ఈరంగంలోకి అడుగుపెట్టాయి. వీటిలో ఎట్రియో, మేలదత్ ఆటో కాంపోనెంట్‌లు కూడా చేరాయి.
ఏవైనా పాత పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ హైబ్రిడ్ స్కూటర్‌గా సులభంగా మార్చేందుకు అవసరమైన హైబ్రిడ్ కిట్‌ను విడుదల చేసేందుకు మేలదత్ సిద్ధమవుతోంది. అంటే, ఈ స్కూటర్ అవసరమైతే పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ మోడ్‌లో నడపవచ్చన్నమాట. దీని కోసం మేలదత్ కంపెనీ రూ. 40 వేల రూపాయల వరకు వసూలు చేస్తుంది.
ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఎంతంటే..
ఆల్టియస్ ఆటో సొల్యూషన్స్ కంపెనీ వ్యవస్థాపకుడు రాజీవ్ అరోరా ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం బ్యాటరీ ధర కిలోవాట్‌కు రూ. 13 నుంచి రూ. 15 వేల వరకు ఉంటుందని తెలిపారు. ఇందులో ప్రభుత్వం కిలోవాట్ కు రూ .15,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. దీంతో తయారీదారులకు కిలోవాట్ కు రూ .2 వేలు ఆదా అవుతోంది. ఈమేరకు వాహనంలో ఉపయోగించే ఇతర భాగాల ధర తగ్గేందుకు అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి అయ్యే ఖర్చు..
ఈ-స్కూటర్ సిద్ధం చేయడానికి రూ. 30 నుంచి రూ. 45 వేల రూపాయల ఖర్చు అవుతుందని రాజీవ్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో వివిధ రకాల మోటార్లు ఉపయోగిస్తుండడంతో వ్యత్యాసం ఉంటుందని వెల్లడించారు. స్కూటర్ తయారీలో అతిపెద్ద ఖర్చు దాని మోటార్‌కే ఖర్చవుతుంది. ప్రస్తుతం రెండు రకాల మోటార్లు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగిస్తున్నారు. మోటార్ నాణ్యతను బట్టి స్కూటర్ ధర మారుతుంది.
హబ్ మోటార్: ఇది వాహనం చక్రం లోపల ఉంటుంది. దీని ధర ఎక్కువేమి కాదు. దాదాపు రూ. 20 వేలలోపే ఉంటుంది.
మిడ్ డ్రైవ్ మోటార్: ఇది వాహనం మధ్యలో ఇన్‌స్టాల్ చేస్తారు. గొలుసు లేదా బెల్ట్ సహాయంతో వాహనాన్ని నడుపుతుంది. అయితే ఈ మోటార్ మాత్రం కాస్త ఖరీదైనదే.
Also Read:September 1: సెప్టెంబర్ 1 నుంచి ఈ అంశాల్లో మార్పులు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
Credit Card: క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా లాక్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?