వరదలతో ఈవీ కారు బ్యాటరీ డ్యామేజ్.. బీమా కంపెనీకి షాకిచ్చిన వినియోగదారుల కమిషన్

బీమా క్లెయిమ్‌ను అన్యాయంగా తిరస్కరించినందుకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీపై కీలక తీర్పు వెలువడింది. హైదరాబాద్ వరదల కారణంగా దెబ్బతిన్న ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీకి పరిహారం చెల్లించాలంటూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సేవల్లో లోపం స్పష్టంగా ఉందని తేల్చిన కమిషన్.. బీమా సంస్థ రూ.7.07 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

వరదలతో ఈవీ కారు బ్యాటరీ డ్యామేజ్.. బీమా కంపెనీకి షాకిచ్చిన వినియోగదారుల కమిషన్
Consumers Forum Judgment

Edited By:

Updated on: Jan 23, 2026 | 3:38 PM

బీమా క్లెయిమ్‌ను అన్యాయంగా తిరస్కరించినందుకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీపై కీలక తీర్పు వెలువడింది. హైదరాబాద్ వరదల కారణంగా దెబ్బతిన్న ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీకి పరిహారం చెల్లించాలంటూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సేవల్లో లోపం స్పష్టంగా ఉందని తేల్చిన కమిషన్.. బీమా సంస్థ రూ.7.07 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

హైదరాబాద్ మహానగరంలోని దిల్‌షుక్‌నగర్‌కు చెందిన సీబీఎస్ ఏజెన్సీస్ అనే సంస్థ 2022 ఫిబ్రవరి 10 నుంచి ఒక ఎలక్ట్రిక్ కారును ఉపయోగిస్తోంది. ఈ వాహనానికి సంబంధించి 2023 ఏప్రిల్‌లో రూ.13.84 లక్షల విలువైన ప్రైవేట్ కార్ స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకుంది. అయితే అదే నెల చివర్లో హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంటి బయట నిలిపిన కారు నీటమునిగి తీవ్రంగా దెబ్బతింది. మే 4న వాహనాన్ని అధికారిక సర్వీస్ సెంటర్ అయిన తేజస్వీ ఆటోమొబైల్స్‌కు తరలించారు.

కారును పరిశీలించిన సర్వీస్ సెంటర్ సిబ్బంది.. ఏబీఎస్ కంట్రోలర్ మార్పిడికి రూ.20 వేలుగా, బ్యాటరీ పూర్తిగా దెబ్బతినడంతో రూ.7,07,589.75 ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయినప్పటికీ బీమా కంపెనీ నియమించిన సర్వేయర్ జూలై 31న క్లెయిమ్‌ను తిరస్కరించాడు. నష్టం ప్రమాద కారణాలతో సరిపోలడం లేదని స్పష్టం చేశాడు. ఈ నిర్ణయంపై సంస్థ ఐఆర్‌డీఏఐ గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది దీంతో సీబీఎస్ ఏజెన్సీస్ మేనేజింగ్ పార్ట్‌నర్ సంతోష్ దయానంద్ 2023 డిసెంబర్ 28న వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

వాహన మరమ్మతులు, పార్కింగ్ ఛార్జీలు, అద్దె వాహన ఖర్చులు, వ్యాపార నష్టం, మానసిక వేదన కలిపి రూ.17 లక్షలకు పైగా పరిహారం కోరారు. విచారణ అనంతరం కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని సమగ్రంగా పరిశీలించకుండా.. సర్వేయర్ నేరుగా క్లెయిమ్‌ను తిరస్కరించడం స్పష్టమైన సేవా లోపమని పేర్కొంది. అయితే పార్కింగ్ ఛార్జీలు, వ్యాపార నష్టం వంటి అంశాలకు పక్కా ఆధారాలు లేవని భావించి వాటిని కొట్టివేసింది. ఫలితంగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాటరీ నష్టానికి రూ.7,07,589.75ను, కేసు దాఖలు చేసిన తేదీ నుంచి అమలు వరకు 9 శాతం వడ్డీతో పాటు.. సర్వీస్ ఛార్జీల కింద రూ.20 వేలు, మానసిక వేదనకు పరిహారంగా 50 వేల రూపాయలను 45 రోజులలోగా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.