Petrol: పెట్రోల్, డీజిల్ నిల్వలు.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

పెట్రోల్, డీజిల్ నిల్వలను అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించేందుకు సిద్దమైంది. ఇందుకోసం ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని భూకంప సర్వేను నిర్వహించనుంది. ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. అందులో భాగంగా ఈ ముందడుగు వేసింది.

Petrol: పెట్రోల్, డీజిల్ నిల్వలు.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
Petrol And Disel

Updated on: May 28, 2026 | 3:51 PM

పెట్రోల్, డీజిల్‌ను ఇతర దేశాల నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక విదేశాల్లో యుద్దాలు, ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నప్పుడు సరఫరా గొలుసు వ్యవస్థకు అంతరాయం కలగడం వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి. దీంతో దిగుమతులు తగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు. వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. దీని వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం అనేది కొంతమేర తగ్గుతుంది.

భూకంప సర్వే నిర్వహించేందుకు రెడీ

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చమురు, సహజ వాయువు నిల్వలను కనుగొనేందుకు సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పాత భూగర్భ శాస్త్ర సమాచారాన్ని పున:పరిశీలించనుంది. వివిధ ప్రాంతాల్లో కొత్త భూకంప సర్వేలను చేపట్టనుంది. విదేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించడం, దేశంలో స్వయం సమృద్దిని సాధించేందుకు అడుగులు వేస్తోంది. పాత సీస్మిక్ డేటాను పరిశీలించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త 3డీ సీస్మిక్ సర్వేలను నిర్వహించేందుకు సిద్దమవుతోంది. పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఈ సర్వే కార్యకలాపాలను సమన్వయం చేయనుంది. ఈ సర్వేలో భాగంగా ఆధునిక ఇమేజింగ్ పద్దతులను ఉపయోగించి దశాబ్దాల నాటి భూగర్భ శాస్త్ర సమాచారాన్ని పున:పరిశీలిస్తారు. పాత పరీక్షల్లో కనిపెట్టని చమురు, గ్యాస్ నిల్వలను ఈ కొత్త టెస్టుల ద్వారా గుర్తించనున్నారు.

సర్వే ఎలా చేస్తారు..?

ధ్వని తరంగాలను భూగర్భంలోకి పంపుతారు. అవి తిరిగి ప్రతిబింబిస్తాయి. చమురు కంపెనీలు ఎక్కడ తవ్వాలో నిర్ణయించడానికి ఇటువంటి సర్వేలను ఉపయోగిస్తాయి. పాత పద్ధతులకు భిన్నంగా అత్యాధునిక కంప్యూటింగ్ వ్యవస్థలు, ఆధునిక డేటా ప్రాసెసింగ్‌ను ఉపయోగించడం ద్వారా మరింత కచ్చితమైన సమాచారం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పూర్ణియా, మహానది బేసిన్, కృష్ణా గోదావరి బేసిన్, కావేరీ బేసిన్, అండమాన్ (తూర్పు) బేసిన్‌లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రత్యేక సర్వే కంపెనీలకు ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించనుంది. భారత్ 85 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల భారత్ ఆర్ధిక వ్యవస్థకు కూడా మేలు చేకూరుతుంది. అంతేకాకుండా ధరలు కూడా అదుపులో ఉంటాయి.  కాగా అమెరికా-ఇరాన్ యుద్దం వల్ల చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి.

Follow Us