Toll Charges: కేంద్రం కొత్త రూల్.. టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్..! అప్పటినుంచే అమల్లోకి..

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఇప్పటివరకు టోల్ గేట్ల వద్ద నగదు రూపంలో టోల్ ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఫాస్టాగ్ ఉంటే దాని ద్వారా ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతాయి. కానీ త్వరలో క్యాష్ పేమెంట్స్ పూర్తిగా నిలిపివేయనున్నారు.

Toll Charges: కేంద్రం కొత్త రూల్.. టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్..! అప్పటినుంచే అమల్లోకి..
Toll Gates

Updated on: Jan 17, 2026 | 5:18 PM

ప్రస్తుతం ఫాస్టాగ్ లేనివారు నగదు రూపేణా టోల్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. అయితే ఇక నుంచి క్యాష్ రూపంలో టోల్ ఛార్జీ చెల్లించడానికి వీలు కాదు. ఇప్పటివరకు ఫాస్టాగ్ వినియోగదారుల కోసం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లు అందుబాటులో ఉండగా.. క్యాష్ చెల్లించేవారి కోసం ప్రత్యేక లైన్లు ఉన్నాయి. కానీ ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు పూర్తిగా బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకురానుందని సమాచారం.

ఇక మొత్తం ఫాస్టాగ్‌ ద్వారానే..

ఇక నుంచి కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తారు. క్యాష్ రూపంలో చెల్లించడానికి వీలు పడదు. ఈ మేరకు కొత్త ఆర్ధిక సంవత్సరం 2026-27 ప్రారంభం కానున్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారతదేశంలో టోల్ విధానంలో మార్పులు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టోల్ గేట్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటుగా ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని మోదీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కొత్త విధానం ద్వారా వేగవంతమైన ప్రయాణం, ఇంధన ఆదా, లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఫాస్టాగ్ లేదా యూపీఐ

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న కొత్త టోల్ ఫీజు విధానం ద్వారా ప్రయాణికులు టోల్ చెల్లించడానికి ఫాస్టాగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. క్యాష్ రూపంలో టోల్ ఫీజు చెల్లించడానికి అవకాశం ఉండదు. దీంతో ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఫాస్టాగ్ వాడాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ లేకపోతే యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఉన్న క్యాష్ లైన్లను కూడా పూర్తిగా ఎత్తివేసే అవకాశముంది. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. ఫాస్టాగ్ లేనివారు లేదా ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేనివారు టోల్ గేట్ల కౌంటర్ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ లేనివారి దగ్గర అదనంగా 1.25 రేట్లు ఎక్కువ ఫీజు వసూలు చేస్తారు. ప్రస్తుతం నగదు రూపంలో టోల్ చెల్లించేవారి దగ్గర 2 రెట్లు అదనంగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.