
కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో ఊరట కలిగించనుందని, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నెలవారీ కనీస పెన్షన్ లిమిట్ మొత్తాన్ని పెంచనుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్నాయి. ప్రస్తుతం నెలవారీ కనీస పెన్షన్ రూ.వెయ్యి ఉండగా.. దీనిని రూ.7,500కు పెంచనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఈ మేరకు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. పార్లమెంట్‌లో కనీస పెన్షన్ పరిమితి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఈపీఎఫ్‌వో కనీస పెన్షన్ పరిమితిని పెంచుతున్నారా..? అనే దానిపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారంటే..?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెన్షన్ పరిమితిని పెంచే ఆలోచన లేదని మాన్సుఖ్ మాండవియా స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకు రూ.వెయ్యిగా ఉందని, అందులో సవరణలు చేసేముందు పెన్షన్ ఫండ్ పథకం స్థిరత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా ఇది మద్దతు ఇస్తుందని, ప్రభుత్వ వార్షికంగా చెల్లించే 1.16 శాతం వేతన సహకారానికి అందనంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పెన్షన్ లిమిట్‌ను పెంచే ఆలోచన లేదని తేల్చేశారు. పెన్షన్ పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు మూడు రోజుల పాటు ఆందోళనలు నిర్వహించారు. అలాగే సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. గతంలో దీనిపై కేంద్రం కార్మికశాఖ మంత్రితో కూడా చర్చలు జరిపాయి.
ఈ క్రమంలో లోక్‌సభ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ కనీస పెన్షన్ పరిమితిని పెంచడంపై లోక్‌సభలో ప్రశ్నను లేవనెత్తారు. దీంతో మాన్సుఖ్ మాండవీయ స్పందించారు. సుప్రీం ఆదేశాలతో ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సిస్టమ్‌లో మార్పులు తీసుకొస్తుందని, దీని ద్వారా జాయింట్ అప్లికేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. బేసిక్ శాలరీ రూ.15 వేలల్లోపు ఉన్నవారు మాత్రమే పెన్షన్ స్కీమ్ కిందకు వస్తారని, దీని ఆధారంగా పెన్షన్ లభిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 1.16 శాతం చొప్పున పెన్షన్ ఫండ్‌కు జమ చేస్తోందన్నారు. కేంద్రం ఇప్పటికే అదనంగా సొమ్ము వస్తుందన్నారు. కాగా ఈపీఎఫ్‌వో కనీస పెన్షన్‌ను రూ.7 వేలకు పెంచాలనే డిమాండ్లు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం పెంచుతుందనే వార్తలు వచ్చాయి.