ఇప్పటి వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో టెలికం కంపెనీలకు పెద్ద ఎత్తున ఊరట కల్గినట్లైంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్‌లు రూ.42,000 కోట్లకు పైగా స్పెక్ట్రం రుసుము చెల్లించాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం ఈ టెలికం ఆపరేటర్లలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. ముఖ్యంగా వోడాఫోన్ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. పెద్ద ఎత్తున అప్పులు ఉండటంతో.. ఇక కంపెనీ చేతులెత్తేసి దేశం విడిచి వెళ్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనికి ముఖ్య కారణం ఇటీవల ఆపరేటర్ల మధ్య నెలకొన్న పోటీ. దీంతో ఈ సంక్షోభంలో వోడాఫోన్, ఎయిర్ టెల్, ఐడియా నష్టాల్లోకి వెళ్లాయి. అదే సమయంలో జియో మాత్రం మంచి లాభాలను గడించింది. అయితే తాజాగా కేంద్రం చేసిన ప్రకటనతో వోడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ కంపెనీలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి.
కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించి ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఇటీవల టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గమనించి.. సీఓఎస్ సిఫారసులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండేళ్ల పాటు స్పెక్ట్రం వేలం వాయిదాల చెల్లింపులను వాయిదా వేసినట్టు తెలిపారు. దీంతో రాబోయే 2020 – 21, 2021- 22 సంవత్సరాలకు కంపెనీలు స్పెక్ట్రం చెల్లింపులు చెల్లించాల్సిన అవసరం లేదు. తిరిగి 2022-23 సంవత్సరానికి చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో.. టెలికం కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.