AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: 10 నిమిషాల్లో డెలివరీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Anand Mahindra: కొవిడ్‌ కారణంగా ఇటీవలి కాలంలో ఫుడ్‌, గ్రాసరీ డెలివరీ యాప్ లకు నగరాల్లో ఆదరణ పెరిగింది. అదే సమయంలో వాటి మధ్య పోటీ కూడా తీవ్రమైంది. దీనిపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Anand Mahindra: 10 నిమిషాల్లో డెలివరీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Anand Mahindra
Ayyappa Mamidi
|

Updated on: Apr 19, 2022 | 6:39 AM

Share

Anand Mahindra: కొవిడ్‌ కారణంగా ఇటీవలి కాలంలో ఫుడ్‌, గ్రాసరీ డెలివరీ యాప్ లకు నగరాల్లో ఆదరణ పెరిగింది. అదే సమయంలో వాటి మధ్య పోటీ కూడా తీవ్రమైంది. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీలు కొత్త పద్ధతులను పాటిస్తున్నాయి. ఇందులో భాగంగా 10 నిమిషాల్లోనే డెలివరీ(Delivery) అనే కొత్త స్లోగన్‌ను అందుకున్నాయి. తొలుత నిత్యావసర వస్తువులకే(Necessities) పరిమితమైన ఈ విధానం.. ఇటీవల దేశీయ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం జొమాటో సైతం అందిపుచ్చుకుంది. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం నెటిజన్ల పక్షాన నిలిచారు. కానీ.. గంటలోనే కాస్త మెత్తబడ్డారు. ఎందుకంటే.. 10 నిమిషాల్లో డెలివరీ గురించి తన అభిప్రాయం తెలుపుతూ టాటా మెమోరియల్‌ డైరెక్టర్‌ సీఎస్‌ ప్రమేశ్‌ తొలుత ఒక ట్వీట్‌ చేశారు. 10 నిమిషాల్లో నిత్యావసరాల డెలివరీ అనేది అమానవీయం, దీనివల్ల డెలివరీ సిబ్బంది తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  నిత్యావసర సరకులు 10 నిమిషాల్లో చేరకపోతే ఏమీకాదని.. ఇలాంటివి ఆపాలని కోరుతూ ఆయా సంస్థలను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ఈ అభిప్రాయంతో తాను కూడా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

అక్కడి గంటసేపటికి నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే జెప్టో సంస్థ వ్యవస్థాపకుడు ఆదిత్‌ పలిచా దీనిపై స్పందించారు. 10 నిమిషాల్లో డెలివరీపై వివరణ ఇస్తూ ఆనంద్‌ మహీంద్రాను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. 10 నిమిషాల డెలివరీ అనేది దూరానికి సంబంధించినదే తప్ప.. వేగానికి సంబంధించినది కాదని అన్నారు. సగటున 1.8 కిలోమీటర్ల దూరం నుంచే జెప్టో(Zepto) ఈ సేవలను అందిస్తోందని.. కాబట్టి  10 నిమిషాల వ్యవధిలో డెలివరీ చేయడం అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు. అందుకే సగటున జరిగే రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే జెప్టోలో రోడ్డు ప్రమాదాల రేటు తక్కువగా ఉందని వెల్లడించారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. మరో కోణంలో చూసినప్పుడు ఇది న్యాయంగానే అనిపిస్తోందంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. జెప్టో వ్యవస్థాపకుడి సమాధానంతో ఆనంద్‌ మహీంద్రా సంతృప్తి చెందినట్లు కనిపించినా.. నెటిజన్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్యాకింగ్‌, బిల్లింగ్‌, అడ్రస్‌ వెతకడానికి 10 నిమిషాలు సరిపోతుందా? అంటూ జెప్టో వ్యవస్థాపకుడిని నిలదీశారు. ప్రమాదాల గురించి ప్రస్తావించడంపైనా మండిపడుతున్నారు. ఏదైమైనా 10 నిమిషాల్లోనే డెలివరీలపై నెట్టింట్లో చాలా పెద్ద చర్చ జరుగుతోంది.

ఇవీ చదవండి..

Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం

Rupee: బలహీనపడిన భారత కరెన్సీ.. డాలర్‌తో పోలిస్తే 10 పైసలు తగ్గిన రూపాయి..