

Budget 2022

మెరుగైన సామాజిక భద్రతా వ్యవస్థ అవసరం అని చాలామంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఏకాంబరం.. ”మధ్యతరగతి ప్రజలకు మరింత డబ్బు ఆదా చేయడంలో సహాయపడటానికి మెరుగైన సామాజిక భద్రతా వ్యవస్థ ఉత్తమ మార్గం” అని భావిస్తున్నట్టు చెప్పారు. అంటే బ్యాంకుల్లో అర్థిక భద్రతను కల్పిస్తూనే మరింత మెరుగైన రాబడి అందించే పథకాలను తీసుకు వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. దాదాపుగా చాలామంది ప్రజలు ఈ అంశాన్ని కోరుకుంటున్నారు.

తమ దగ్గర ఉన్న చిన్న చిన్న మొత్తాలను బ్యాంకులలో డిపాజిట్ చేస్తే వాటిపై రాబడి అంతంత మాత్రంగానే ఉంటోందనీ.. ఇక ఎప్పటికప్పుడు బ్యాంకుల వడ్డీరేట్లు సవరిస్తూ రావడంతో వాటిపై సరైన ఆదాయం వచ్చే అవకాశం లేకుండా పోయిందనీ అంటున్నారు. దీనికోసం వివిధరకాలైన పెట్టుబడి మార్గాలలోకి ప్రజలు మళ్లుతున్నారు. అయితే, వీటిలో ఒక్కోసారి తగిలే ఎదురుదెబ్బలకు అసలు కూడా నష్టపోయిన సందర్భంగా ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే ప్రభుత్వం సాధారణ ప్రజల పొదుపు కోసం ప్రత్యేక పథకాలు పకటిస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక వివిధ వర్గాల ప్రజలు బ్యాంకులను ప్రైవేటీకరించడంపై కూడా స్పందించారు. అన్ని బ్యాంకులు ప్రైవేట్ సెక్టార్ లోకి వెళ్ళిపోతే ప్రజల సొమ్ముకు భరోసా ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చే సేవలకు ప్రయివేట్ బ్యాంకు సేవలకు చాలా తేడా ఉంటుందనీ.. బ్యాంకుల ప్రయివేటీకరణపై పునఃపరిశీలన చేయాలనీ కోరుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ పెద్దగా అందుబాటులో లేదనీ, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడం, బ్యాంకుల్లో తమ సొమ్ము డిపాజిట్ చేసుకునే విధంగా గ్రామీణ ప్రజలను ప్రోత్సహించడం అవసరమని మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు.

రానున్న బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మధ్య తరగతి ప్రజలకు మరింత చేరువలోకి వచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉంటాయని ఆశిస్తున్నారు.