
ఇరాన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అయితే ఈ అనిశ్చితి కాలంలో ఇన్వెస్టర్లు ఎప్పుడూ నమ్మే బంగారం, అమెరికన్ డాలర్ల కంటే బిట్‌కాయిన్ అనూహ్యంగా దూసుకుపోతుండటం ఇప్పుడు ఆర్థిక నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫిబ్రవరి 28న ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుండి బిట్‌కాయిన్ విలువ సుమారు 10 శాతం పెరిగి 72,000 వేల మార్కును దాటింది. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నా, స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి ఉన్నా.. క్రిప్టో మార్కెట్ మాత్రం బలంగా నిలబడింది. గతంలో ఎన్నడూ బిట్‌కాయిన్‌ను ఒక సురక్షిత ఆస్తిగా పరిగణించనప్పటికీ ప్రస్తుత పరిస్థితులు ఆ అంచనాలను మార్చేస్తున్నాయి.
సాధారణంగా సంక్షోభం వస్తే ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తారు. కానీ ఈసారి బిట్‌కాయిన్ వైపు మొగ్గు చూపడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. దీనిపై INRGrid స్టేబుల్ వ్యవస్థాపకులు అనుజ్ చౌదరి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘‘యుద్ధం సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించవచ్చు, ప్రభుత్వాలు ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. కానీ బిట్‌కాయిన్ అలా కాదు. ఇది సరిహద్దులు లేనిది, తక్షణమే బదిలీ చేయగల సౌలభ్యం దీని అతిపెద్ద బలం’’ అని అన్నారు. బంగారం లేదా నగదును భౌతికంగా భద్రపరచడం కంటే డిజిటల్ రూపంలో ఉన్న బిట్‌కాయిన్‌ను ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు. ఇది రాజకీయ వాతావరణంతో సంబంధం లేకుండా యజమానికి అందుబాటులో ఉంటుంది.
చారిత్రాత్మకంగా యుద్ధం సమయంలో పెరగాల్సిన బంగారం ధర ప్రస్తుతం 5,000 – 5,200 డాలర్ల మధ్యే ఊగిసలాడుతోంది. దీనికి ప్రధాన కారణం అమెరికన్ డాలర్ బలపడటం. డాలర్ పెరిగినప్పుడు ఇతర కరెన్సీ వాడకందారులకు బంగారం ధర భారమవుతుంది. పైగా, చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలు కూడా బంగారంపై ప్రభావం చూపుతున్నాయి.
ఇన్వెస్టోపీడియా నివేదిక ప్రకారం.. ఐషేర్స్ బిట్‌కాయిన్ ట్రస్ట్, ఫిడిలిటీ వైజ్ ఆరిజిన్ వంటి ఫండ్లలోకి 1.1 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాల సమయంలోనూ క్రిప్టో వాల్యూమ్స్ పెరగడం గమనార్హం. మొత్తానికి మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆర్థిక భద్రత అనే భావననే మార్చేస్తున్నాయి. ప్రభుత్వాల నియంత్రణ లేని, సులభంగా బదిలీ చేయగల బిట్‌కాయిన్.. నూతన శకపు డిజిటల్ గోల్డ్‌గా అవతరిస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.