
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ గుడ్ న్యూస్ అందించనుంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై కేంద్రం వార్షిక వడ్డీని అందిస్తున్న విషయం తెలిసిందే. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇటీవల వడ్డీ రేటును నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 8.25 శాతాన్ని కొనసాగించింది. కార్మికశాఖ వడ్డీ రేటును ఆమోదించి కేంద్ర ఆర్థికశాఖకు పంపింది. ఆర్ధికశాఖ త్వరలో ఆమోదించనుందని తెలుస్తోంది. ఆర్దిక మంత్రిత్వశాఖ ఆమోదం తర్వాత పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ జమ కానుంది. పీఎఫ్ అకౌంట్లో ఈ వడ్డీ త్వరలో జమ చేయనుందని తెలుస్తోంది.
ఇక పీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని పెంచాలని కార్మిక సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులు, ద్రవ్యోల్బణం, అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ను పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పలుమార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సరిపోవడం లేదని, రూ.7,500కు పెంచాలని కోరుతున్నారు. ఇటీవల పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షన్ పెంపును సూచించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ పెంపు దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈపీఎస్ 95 కింద పెన్షన్ పరిమితి పెంచాలని యోచిస్తోంది. ఇదే జరిగితే ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్తగా చెప్పవచ్చు. 58 ఏళ్ల తర్వాత పీఎఫ్ ఖాతాదారులకు నెలనెలా పెన్షన్ అందుతుంది. ఉద్యోగి జీతం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. ఉద్యోగి నుంచి కొంత మొత్తం, యజమాని వాటా కింద కొంత మొత్తం కట్ చేసి పెన్షన్ ఖాతాలో వేస్తారు. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి రూ.వెయ్యి మాత్రమే ఉంది. ఖర్చులు పెరుగుతున్నా దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. దీంతో ఉద్యోగులు పెన్షన్ పరిమితి పెంచాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే మూడు నెలల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇక ఏటీఎం నుంచి పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో కేంద్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. మీ పీఎఫ్ ఖాతాతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్‌ను ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌కు అనుసంధానిస్తారు. త్వరలోనే పీఎఫ్ డెబిట్ కార్డు పేరుతో ప్రత్యేక కార్డును అందిస్తారు. దీని సాయంతో పీఎఫ్ ఖాతాదారులు డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చని తెలుస్తోంది. దీని వల్ల ఎప్పుడు, ఎక్కడైనా పీఎఫ్ నగదు తీసుకోవచ్చు.