ఎలక్ట్రిక్ స్కూటర్లకు మన భారతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో బీగాస్ కంపెనీ కూడా ఒకటి. ఈ కంపెనీ నుంచి తన మొదటి స్కూటర్ ను కొంత కాలం క్రితమే ప్రకటించింది. దీని పేరు బీగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఉత్పత్తిని ఇప్పుడు ప్రారంభించింది. మహారాష్ట్రలోని చకన్ ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తోంది. ఈ స్కూటర్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్‌లకు డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. బీగాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కబ్రా మాట్లాడుతూ తమ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో అలు బీగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్ అసాధారణమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని బీగాస్ కంపెనీ ప్రకటించింది. అలాగే విస్తారమైన స్టోరేజీ స్థలాన్ని అందిస్తుందని పేర్కొంది. రైడర్ యుటిలిటీని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ స్కూటర్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకసారి పూర్తి చార్జ్‌పై 145 కిమీల పరిధిని అందిస్తుంది. స్కూటర్ గరిష్టంగా 75 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో మూడు విభిన్న నిల్వ ప్రాంతాలు ఉన్నాయి. ఇది రైడర్‌లకు ముఖ్యమైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్ అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. ఈ స్కూటర్16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. తక్కువ ప్లాస్టిక్ వాడకంతో మెటల్ బాడీని కలిగి ఉంటుంది. అధిక-పనితీరు గల ఇన్‌వీల్ హైపర్ డ్రైవ్ మోటార్ తో వస్తుంది. మరిన్ని స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
బీగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్ 90 శాతం లోకల్ గా తయారు చేసిన విడి భాగాలతోనే దీనిని తయారు చేశారు. కొన్ని భాగాలు మాత్రమే దిగుమతి చేసుకున్నారు. స్కూటర్ మెటల్ బాడీని కలిగి ఉంది. ట్యూబ్‌లెస్ టైర్‌లతో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. బూట్‌లో 20 లీటర్లు, ముందు భాగంలో 2.2 లీటర్లు, ఫుట్ ఫ్లోర్ కింద అదనంగా 4.5 లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్‌లు, లైవ్ వెహికల్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, డ్యూయల్ థీమ్‌లు, ఆటోమేటిక్ డిస్‌ప్లేకు మద్దతు ఇచ్చే 5-అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ (బేస్ వేరియంట్‌లో అందుబాటులో లేదు) సహా అనేక ఆధునిక ఫీచర్లను కూడా స్కూటర్ అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..