
పెట్రోల్ ధరలు భరించలేం అనుకునేవాళ్ల కోసం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్‌జీ కార్ల వంటి ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఎలక్ట్రిక్ కార్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇక మిగిలింది సీఎన్‌జీ ఒక్కటే. పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీ ధరలు తక్కువ. పైగా సీఎన్‌జీ ఇచ్చే మైలైజ్ చాలా ఎక్కువ. అందుకే చాలామంది సీఎన్‌జీ ఆప్షన్ ఉన్న కార్లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్న బెస్ట్ సీఎన్‌జీ కార్స్‌పై లుక్కేస్తే..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ బడ్జెట్ ఫ్యామిలీ సీఎన్‌జీ కారుగా మారుతి వ్యాగన్ ఆర్‌ని చెప్పుకోవచ్చు. ఈ కారు సీఎన్ జీ మోడల్ ధర రూ. 5.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 998 సీసీ ఇంజిన్ తో వస్తుంది. 56 పిఎస్ పవర్, 92.1 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది కిలోకు 34.05 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇఎస్‌పి మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. విశాలమైన క్యాబిన్ తో ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటుంది.
బెస్ట్ బడ్జెట్ కారుగా పేరు పొందిన ఆల్టో కె10 లో కూడా CNG ఆప్షన్ ఉంది. దీని ధర రూ. 4.82 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో కూడా వ్యాగన్ ఆర్ లో ఉన్న 998సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 పీఎస్ పవర్, 82.1 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కిలోకు 33.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో కూడా ఆరు ఎయిర్‌బ్యాగులు, బ్యాక్ సెన్సార్ల వంటి ఫీచర్లు ఉన్నాయి.
మినీ ఎస్‌యూవీగా పిలిచే మారుతి ఎస్-ప్రెస్సో CNG మోడల్ ధర రూ. 4.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.0 -లీటర్ మారుతి K సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 56పీఎస్ పవర్, 82.1 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. డ్యుయల్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్ల వంటి ఫీచర్లతో వస్తుంది.
బడ్జెట్ లో ప్రీమియం లుక్ కావాలనుకునేవారికి మారుతి సెలెరియో సూట్ అవుతుంది. దీని CNG వేరియంట్ ధర రూ. 5.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 998 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 పీఎస్ పవర్, 82.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీఛర్లు ఉన్నాయి.
ఇక టాటా నుంచి బడ్జెట్ లో మరో CNG ఆప్షన్ ఉంది. అదే టియాగో సీఎన్‌జీ. దీని ధర రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2-లీటర్ ఇంజిన్.. 72 పీఎస్ పవర్, 95 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కిలోకి 28.06 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 4 స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..