బ్యాంకులు ఎప్పుడు పనిచేస్తాయి? ఎప్పుడు సెలవు ఉంటుందనే విషయంలో వినియోగదారులకు అవగాహన ఉండటం అవసరం. వినియోగదారులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగానే ఉంటారు. అయితే రేపు అంటే మే 23న(గురువారం) బ్యాంకులకు సెలవు అన్న విషయం వైరల్ అవుతోంది. ఎందుకు? సెలవు? రేపు ఏంటి విశేషం అని చాలా మంది నెట్ లో సెర్చింగ్ చేస్తున్నారు. వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా సెలవుల జాబితాలో మే23న సెలవుగా పేర్కొంది. ఎందుకంటే గురువారం బుద్ధ పూర్ణిమ. ఈ సందర్భంగా మే 23న అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, వ్యక్తులు ఆర్థిక నిర్వహణను సులభతరం చేసిన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే మన రాష్ట్రంలో కూడా బ్యాంకులకు సెలవేనా? తెలియాలంటే ఇది చదవండి..
త్రిపుర, మహారాష్ట్ర, మిజోరం, మధ్యప్రదేశ్, చండీగఢ్, ఉత్తరా ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, న్యూఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలోని బ్యాంకులకు బుద్ధ పూర్ణిమ సందర్భంగా గురువారం బ్యాంకులకు సెలవు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయన్న మాట.
బుద్ధ జయంతి లేదా వెసక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పర్వదినం. ఇది మే (వైశాఖం) పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనిని మూడుసార్లు దీవించిన రోజు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున లుంబినీలో బుద్ధుని జననం, బుద్ధగయలో జ్ఞానోదయం, కుసినగర్‌లోని మహాపరినిర్వాణ ప్రవేశంతో సహా భగవాన్ బుద్ధుని జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలను స్మరించుకుంటారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవు జాబితా ప్రకారం.. మే 2024లో 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. మహారాష్ట్ర దిన్/మే డే (కార్మిక దినోత్సవం), లోక్‌సభ సాధారణ ఎన్నికలు 2024, రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు, బసవ జయంతి/అక్షయ తృతీయ, రాష్ట్ర దినోత్సవం, బుద్ధ పూర్ణిమ, నజ్రుల్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, ఈ సెలవులు వివిధ రాష్ట్రాలకు అనుగుణంగా మారే అవకాశం ఉంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు కింద ఆర్బీఐ కొన్ని సెలవులను సూచిస్తుంది.
ఒడిశాలోని త్రిపురలో నజ్రుల్ జయంతి/లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 2024 (నాల్గో శనివారం) సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..