
ప్లాటినం ఇప్పటికీ విలువైనదే. కాదనడం లేదు. కాని, బంగారం కంటే విలువైనదైతే కాదు. ఓ 20 ఏళ్ల క్రితం బంగారం ధరకి నాలుగింతల ధర ఎక్కువగా ఉండేది ప్లాటినం. కారణం.. ప్లాటినం దొరకడం కష్టంగా ఉండడమే. బంగారంతో పోల్చి చెప్పాలంటే.. సపోజ్ ఓ 20 బంగారు గనులు ఉన్నాయనుకుంటే.. ప్లాటినం గని మాత్రం ఒక్కటే ఉండేది. అందుకే.. 2001లో పది గ్రాముల బంగారం ధర 4వేలు ఉంటే.. ప్లాటినం ధర దాదాపు 14, 15 వేలు పలికేది. ప్లాటినం చెయిన్, ప్లాటినం రింగ్ పెట్టుకున్నాడంటే.. మహా రిచ్ అని అర్థం అప్పట్లో. అచ్చంగా వెండిలాగే కనిపించినప్పటికీ.. ప్లాటినం క్లాస్ లుక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి ప్లాటినం.. రానురాను బంగారంతో పోటీపడలేకపోయింది. ప్రస్తుతం అదే పది గ్రాముల ప్లాటినం ధర ఎంతుందో తెలుసా.. 26వేల రూపాయలు. మరి.. బంగారం? ఏకంగా లక్ష. ఏమాత్రం కంపారిజన్ లేదు. దీనికి కారణమేంటంటే.. పేదవాళ్ల నుంచి సామాన్యుల వరకు ‘బంగారం బంగారమే’ అని అనుకోవడమే.
మన మైండ్ మరిచిపోయి ఉంటుంది గానీ.. ఓ 30 ఏళ్ల క్రితం వరకు బంగారానికి పెద్దగా డిమాండ్ లేదు. పెళ్లిళ్లు, పేరంటాలప్పుడు మాత్రమే కొనేవాళ్లు. అది కూడా.. తమ వాళ్లందరూ ఫంక్షన్లకు వస్తారన్న ఒక ఆలోచనతో, తాము బాగున్నాం అని నలుగురికీ చూపించుకోడానికి బాగా అలంకరించుకునే వారు. అంతే తప్ప.. ఇప్పట్లాగా పోటీపడి కొనుక్కునే వారు కాదు. అందుకే ధర కూడా అటుఇటుగా ఉండేది. ఒకనాడు బంగారం కంటే వెండే ఈ ప్రపంచాన్ని ఏలిన రోజులు ఉన్నాయి. అలా.. ఒక్కోసారి ఒక్కో మెటల్‌కు టైమ్ వస్తుంది. ఇప్పుడు బంగారానికి టైమ్ వచ్చింది.
ప్లాటినం, వెండి.. బంగారంతో పోటీ పడలేకపోతున్నాయి. దానికి ప్రధాన కారణం.. పెట్టుబడుల్లో ఎక్కువ వాటా బంగారంలోకి రావడమే. బ్యాంకులకు వెళ్లినా, తాకట్టు దుకాణానికి వెళ్లినా.. వెంటనే చేతికి డబ్బు ఇచ్చేది బంగారానికే. ప్లాటినం తీసుకుని ఎవ్వరూ అరువు ఇవ్వరు. అందులోనూ ప్లాటినంతో చేసిన చిన్నచిన్న చెయిన్లు, ఉంగరాలు బాగుంటాయి గానీ.. నగలుగా దిగేసుకుంటే చూడ్డానికేమంత బాగోదు. పైగా వెండికి, ప్లాటినానికి తేడా తెలియని రోజులివి. అందుకే, బంగారంతో పోల్చితే.. ప్లాటినం ఒక జ్యువెలరీగా స్థిరపడలేకపోయింది.
పైగా.. గోల్డ్ బాండ్స్ రావడం, బంగారాన్ని కొనకుండానే పెట్టుబడి పెట్టే సాధనాలు రావడం, బంగారంలో పెట్టుబడి సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం కలగడం కూడా ప్లాటినం డిమాండ్ పడిపోవడానికి కారణమైంది. 2008లో పది గ్రాముల బంగారం 12వేల 500 రూపాయలు ఉంటే.. అదే 10 గ్రాముల ప్లాటినం ధర దాదాపు 32వేలు ఉండేది. కాని, ఆ తరువాత ప్లాటినం ధర పడిపోతూ వచ్చింది. 2015లో వెయ్యి డాలర్లకు పడిపోయింది. అలా దాదాపు 10 ఏళ్ల పాటు ధరలో ఎలాంటి మార్పు చెందకుండా అలా ఉండిపోయింది ప్లాటినం.
డబ్బులు లేకపోయినా.. ఉన్నంతలోనే.. అది ఒక గ్రాము అయినా సరే బంగారమే కొనుక్కునే వారు. అందులోనూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారానికి ప్రత్యామ్నాయమే లేదు. పెట్టుబడులు పెట్టడానికి స్టాక్‌మార్కెట్లు, రియల్ ఎస్టేట్, బాండ్లు ఉన్నప్పటికీ.. స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కుప్పకూలుతాయో తెలీదు. బాండ్లలో పెడితే ఎక్కువ రిటర్న్స్ రావు. రియల్ ఎస్టేట్‌లో పెట్టినా.. అవసరానికి వెంటనే చేతికి డబ్బులొస్తాయన్న గ్యారెంటీ లేదు. సో, ఏరకంగా చూసినా బంగారమే సురక్షితం, సులభంగా కనిపించింది. అందుకే, బంగారానికి అంత డిమాండ్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి