Gold: బంగారం కొనుగోలులో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆభరణాల తయారీలో తరుగు ఎందుకు వస్తుంది?

|

Jan 23, 2023 | 4:57 PM

మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత విలువ ఇస్తుంటారు. ప్రపంచంలోనే బంగారం కొనుగోళ్ల విషయంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో శుభ కార్యాలయాలు, పెళ్లిళ్లు, ఇతర పండగ సందర్భాలలో..

Gold: బంగారం కొనుగోలులో మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆభరణాల తయారీలో తరుగు ఎందుకు వస్తుంది?
Gold
Follow us on

మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత విలువ ఇస్తుంటారు. ప్రపంచంలోనే బంగారం కొనుగోళ్ల విషయంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో శుభ కార్యాలయాలు, పెళ్లిళ్లు, ఇతర పండగ సందర్భాలలో బంగారం షాపులన్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఎందుకంటే బంగారం ఎప్పటికి చెడుపోతుంది. బంగారం ఇంట్లో ఉంటే ఆ ధైర్యమే వేరు. మహిళలు మెడలో వేసుకుంటే అ హుందాతనమే వేరు. అలాగే అత్యవసర సమయాల్లో బంగారంపై రుణాలు సులభంగా తీసుకోవచ్చు. అయితే బంగారం కొనుగోలు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆభరణాల తయారీలోగానీ, బంగారం కొనేటప్పుడుగానీ పసిడిపై కొంత అవగాహన ఉండి తీరాలి. లేకపోతే ఆభరణాల తయారీలో మోసపోయే అవకాశం ఉంది.

బంగారం మెత్తగా, సున్నితంగా ఉంటుంది. సాగే గుణం వలన ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. అలా తయారైన ఆభరణాలు ఏళ్ల తరబడి పాడవకుండా ఉండటం కూడా బంగారంపై మరింత మక్కువ చూపిస్తారు. దేశంలో బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు భారీగానే జరుగుతుంటాయి. మహిళలకు అత్యంత ఇష్టమైనది అంటే అది బంగారమే అని చెప్పక తప్పదు. అందుకే బంగారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆభరణాల తయారీలో ఎలాంటి లోహాలు కలుస్తాయి..? ఎన్ని క్యారెట్ల బంగారం కొంటే మంచిది.. అందులో తరుగు అంటే ఏమిటి? తదితర విషయాలపై అవగాహన ఉండటం మంచిది. ముఖ్యంగా హాల్‌ మార్కింగ్‌ ఉన్న నగలను కొనడం చాలా ముఖ్యం.

ఎలాంటి బంగారం మంచిది..?

బంగారం నాణ్యత, స్వచ్ఛత విషయంలో 0 నుంచి 24 క్యారెట్ల రూపంలో లెక్కిస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే 99.99 శాతం స్వచ్చమైనదని గుర్తించుకోవాలి. ఇందులో స్వల్ప మోతాదులో ఇతర లోహాలు కలుస్తాయి. 24 క్యారెట్ల బంగారం సున్నితంగా ఉండటంతో అభరణాల తయారు చేయడం కష్టం. దీనిని గట్టిదనం చేకూర్చేందుకు కొంత రాగి, వెండి, కాడ్మియం, జింకు వంటి ఇతర లోహాలను కలపుతారు. అప్పుడే ఆభరణాలు తయారు అవుతాయి. ఈ లోహాలు కలిసిన ఆధారంగా బంగారం 22 క్యారెట్లు, 18 క్యారెట్లుగా నిర్ణయిస్తారు. 22 క్యారెట్స్‌ బంగారం అంటే అందులో 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపి ఇతర లోహాలు ఉంటాయని అభరణాల తయారీదారులు చెబుతున్నారు. ఇక 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75 శాతం, ఇతర లోహాలు 25 శాతం ఉన్నాయని గుర్తించుకోవాలి. ఇక 14 క్యారెట్ల బంగారం విషయానికొస్తే 58.5 శాతం, 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. అయితే సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు.

ఇవి కూడా చదవండి

నగల తయారీలో ఏ లోహాలు కలుస్తాయి..?

అలాగే 22 క్యారెట్ల గోల్డ్‌ నగలు చేయాలంటే కొంత రాగి, కాడ్మియం, జింక్‌, వెండి వంటి లోహాలు స్వల్పంగా కలుపుతారు. దానినే 22 క్యారెట్ల బంగారం అంటారు. 100 గ్రాముల 22 క్యారెట్ల బంగారంలో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉండాలి. మిగిలిన 8.4 గ్రాములు ఇతర లోహాలు ఉండాలి. అలా ఉండేదానినే 916 కేడీఎం బంగారం అంటారు. ఇక బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలనుకునే వారు 24 క్యారెట్ల బంగారాన్ని కొంటారు. ఇక 18 క్యారెట్ల బంగారంలో 18 భాగాలుగా గోల్డ్‌ ఉంటే, 6 బంగాల ఇతర మెటల్స్‌ ఉంటాయి. అలాగే 14 క్యారెట్ల గోల్డ్‌లో 58.3 శాతం బంగారం, 41.7 శాతం ఇతర మెటల్స్‌ ఉంటాయి. అయితే బంగారంలో ఏ లోహం కలిపారన్నదాన్ని బట్టి బంగారు ఆభరణం రంగు ఆధారపడి ఉంటుంది. బంగారం స్వచ్ఛతను నునుపు, మెరుపు రంగును బట్టి గుర్తిస్తారు. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతో పాటు కొద్దిగా నల్లని రంగులో ఉంటుంది. బంగారానికి కలిపే లోహాన్ని బట్టి బంగారం రంగు మారుతుందని గుర్తించుకోవాలి.

తరుగు అంటే ఏమిటి..?

బంగారంతో నగలు చేయించుకునేవారు, లేదా తయారు చేసిన నగలను కొనుగోలు చేసేవారు ధరతో పాటు ముఖ్యంగా మజూరీ వంటి విషయాలపై ఆరా తీస్తారు. ఆభరణాలు తయారు చేసే సమయంలో వివిధ దశల్లో బంగారాన్ని కాల్చడం, కరిగించడం, సుత్తితో కొట్టడం, మెషీన్లపై తీగలుగా మార్చడం, డిజైన్లు వేయడం, మెరుగులద్దడం ఇలా చేసే ప్రక్రియలో స్వల్ప మోతాదులో బంగారం వృథా అవుతుంది. దీనినే తరుగు లేదా వెస్టేజ్‌ అని అంటారు.

ఉదాహరణలో చెప్పాలంటే.. రూ.50 వేల విలువైన 10 గ్రాముల బంగారంతో ఉంగరం తయారు చేస్తే మంజూరు అంటే తయారీ ఛార్జీలు 200 మిల్లీ గ్రాములు, ఇతర తరుగు కింద 200 మిల్లీ గ్రాములు మొత్తం 400 మిల్లీ గ్రాములు పోతుంది. ఈ మొత్తాన్ని తరుగుగానే గుర్తిస్తారు. వస్తు తయారీలో 10 గ్రాములకు 70 మిల్లీ గ్రాములు కరిగింపులో పోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఆ బంగారాన్ని రాపడం, డిజైన్ చెక్కడం, చివరగా మెరుగు పెట్టడం చేసేటప్పుడు బంగారం ఒక్కో చోట 15 నుంచి 30 మిల్లీ గ్రాముల వరకు తరుగు రూపంలో పోతుంది. ఇలా తరుగు రూపంలో పోయిన బంగారం అటు వినియోగదారుడు, అటు నగల తయారీదారుకు ఏ మాత్రం మిగలదు.

కస్టమర్‌ ఎక్కడ మోసపోతాడు..?

ఇక తయారైన నగలు కొన్నా.. నగలను తయారు చేసినా 10 గ్రాములకు 400 మిల్లీ గ్రాముల తరుగు, మజూరీకి పోతుంది. అయితే మోసం జరిగే అవకాశం మాత్రం డిజైన్లు, స్టోన్‌ వర్క్‌ ఎక్కువగా ఉండే ఆభరణాలలో ఉంటుంది. నగల తయారీలో అద్దిన స్టోన్స్ బరువును సైతం బంగారంగా చూపిస్తారు. అందులోనూ ఎన్ని ఎక్కువ స్టోన్స్ ఉంటే అంత మోసానికి అవకాశం ఉంటుందని గుర్తించుకోవాలి. స్టోన్స్‌తో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాములుంటే అందులో ఐదు గ్రాములు స్టోన్స్ ఉంటే, రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్క వేసే అవకాశం ఉంటుంది. నగల తయారీలో పొదిగే రాళ్లు ఖరీదు రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.2000 వరకు ఉంటాయి. అయినా కూడా బంగారంలో వాటిని కలిపి చూపిస్తే కస్టమర్ చాలా నష్టపోతారు. అదే తరుగు, తయారీ ఛార్జీలు లేవనే ఆఫర్లు గట్టి గాజులు, గట్టి ఉంగారాలు, డిజైన్ వర్క్ లేని బంగారు ఆభరణాల విషయంలో ఇవ్వరు. ఎందుకంటే ఎక్కువగా నష్టపోయేది అందులోనే కాబట్టి.

బంగారాన్ని యాసిడ్‌తో పరీక్ష చేయవచ్చా?

ఇక కొనుగోలు చేసే బంగారం ఆభరణం స్వచ్ఛత, నాణ్యతను కొనుగోలుదారులు పరీక్షించుకోవచ్చు. అందుకు కొన్ని చిట్కాలను గుర్తించుకోవాలి. ముందగా ఆభరణం అంచులను జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో ఎక్కడైనా రంగు పోయినట్లు, వెలిసినట్లగా అనిపించినట్లయితే అది అసలైన బంగారం కాదని, బంగారం పూత పూశారని అర్థం చేసుకోవాలి. అభరణాల తయారీలో రాగి, జింక్‌, వెండి కాకుండా బరువు ఎక్కువగా రావడం కోసం ఇనుమును సైతం కలుపుతారు. అందుకే అయస్కాంతంతో ఆభరాణాన్ని పరీక్షించవచ్చు. ఇనుము ఉంటే ఆభరణం అయస్కాంతానికి అతుక్కుంటుంది. లేకపోతే అతుక్కోదు. తయారైన బంగారం ఆభరాణాన్ని గీస్తే నల్లటి రంగు కనిపిస్తే స్వచ్ఛమైనది కాదని అర్థం. పసుపు వర్ణం కనిపిస్తే అది స్వచ్ఛమైనదిగా గుర్తించుకోవాలి. ఇక నైట్రిక్‌ యాసిడ్‌ ఒక డ్రాప్‌ వేస్తే బంగారం రంగు మారితే అది నకిలీదని, రంగు ఏ మాత్రం మారకపోతే స్వచ్ఛమైనదని గుర్తించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి