Airports Authority of India: దేశవ్యాప్తంగా ప్రజల విమానయానం పెరిగినా.. పోటీ వాతావరణంలో కొన్ని సంస్థలకు నష్టాలు మాత్రం తప్పడంలేదు. ప్రత్యేకించి కరోనా కాలంలో అయితే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నెలలకు నెలలు ఆగిపోయిన టేకాఫ్‌ల కారణంగా దేశీయ ఏవియేషన్ భారీగా నష్టపోయింది. ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ నిర్ణయం తీసుకుంది. అదే.. ఎయిర్‌పోర్టుల్లో వాటాల అమ్మకం.
గత రెండేళ్లుగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం, ఇంధన ధరలు మాత్రం పెరుగుతూ ఉండడం, ఉద్యోగులు.. వేతనాల్లో ఎక్కడా రాజీపడే పరిస్థితి లేకపోవడంతో ఈ ఆర్థిక సంవత్సంలో కూడా దాదాపు 10వేల కోట్ల నష్టం తప్పదన్నట్లు రేటింగ్ ఏజెన్సీ క్రిసల్ అంచనావేసింది. దీంతో.. నష్టాల నుంచి బయటపడాలంటే ఇప్పుడు విమానాశ్రయాల్లో వాటాల అమ్మకమే తక్షణ మార్గంగా భావిస్తోంది అథారిటీ.
AAI కొన్ని ప్రవేటు సంస్థలతో కలిసి దేశంలోని ఎయిర్‌పోర్టుల్లో సేవలను నిర్వహిస్తోంది. ఆ సంస్థల అభిప్రాయాన్నీ లెక్కలోకి తీసుకున్నాక.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరుల ఎయిర్‌పోర్టుల్లో 13శాతం వాటాను అమ్మడానికి సిద్ధమైంది. అథారిటీ నుంచి కేంద్ర ఏవియేషన్ మంత్రిత్వశాఖకు నివేదిక వెళ్లింది. ఈ నివేదిక చూసి కేంద్ర కేబినెట్ సై అంటే.. అమ్మకం షురూ అవుతుంది. పైగా ప్రక్రియలో మొదట అమ్మకం జరిగేది హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులే. ఆ తర్వాతే ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల అమ్మకాలు జరగనున్నట్లు అథారిటీ రిపోర్ట్‌లో ఉన్నట్లు సమాచారం.