విమానంలో విరిగిన సీటు.. ప్రయాణికుడికి ఎన్ని లక్షల పరిహారం వచ్చిందంటే?

న్యూఢిల్లీ కన్స్యూమర్ కమిషన్ విమాన ప్రయాణికుడికి న్యాయం చేసింది. విమానంలో నాసిరకం సౌకర్యాలు, సిబ్బంది దుర్వ్యవహారంపై ఫిర్యాదు చేసిన ప్రయాణికుడికి, అతని కుమార్తెకు రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ చట్టం 2019 ప్రకారం విమానయాన సంస్థలు సరైన సేవలు అందించాలని కమిషన్ స్పష్టం చేసింది.

విమానంలో విరిగిన సీటు.. ప్రయాణికుడికి ఎన్ని లక్షల పరిహారం వచ్చిందంటే?
Flight

Updated on: Feb 24, 2026 | 8:46 PM

విమాన ప్రయాణంలో నాసిరకం సౌకర్యాలు, దుర్వ్యవహారంపై ఫిర్యాదు చేసిన ఓ ప్రయాణికుడికి న్యాయం దక్కింది. ఈ ఏడాది జనవరి 14న న్యూఢిల్లీ District Consumer Disputes Redressal Commission కీలక తీర్పు వెలువరిస్తూ సంబంధిత విమానయాన సంస్థ సర్వీస్‌లో లోపాలు ఉన్నట్లు తేల్చింది. ఫిర్యాదుదారు, అతని కుమార్తెకు కలిపి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల ప్రకారం.. బాధితుడు తన కుమార్తెతో కలిసి MakeMyTrip ద్వారా భారత్‌ నుంచి న్యూయార్క్‌కు రౌండ్‌ట్రిప్ ఎకానమీ క్లాస్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వీటి కోసం మొత్తం రూ.2,73,108 ఖర్చు చేశారు. అదనంగా కుమార్తె ప్రయాణ తేదీ ముందుకు మార్చేందుకు మరో రూ.45,000 చెల్లించారు. వారు సెప్టెంబర్ 6, 2023న న్యూయార్క్‌కు వెళ్లి, సెప్టెంబర్ 13న భారత్‌కు తిరిగి వచ్చారు.

ఫిర్యాదుదారు తన పిటిషన్‌లో విమాన ప్రయాణం చాలా పేలవంగా సాగిందని పేర్కొన్నారు. ఎకానమీ సీట్లు విరిగిపోయి ఉండటం, బ్యాక్‌రెస్ట్ బటన్లు పనిచేయకపోవడం, సిబ్బందిని పిలిచే కాల్ బటన్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. అలాగే వ్యక్తిగత మానిటర్ స్క్రీన్లు సరిగా పనిచేయలేదని ఆరోపించారు. విమానంలో దుర్వాసన తీవ్రంగా ఉండటంతో ప్రయాణం అసౌకర్యంగా మారిందని చెప్పారు. ఇంకా విమానంలోని వాష్‌రూమ్‌లు మురికిగా ఉండటం, టాయిలెట్ స్ప్రే లేకపోవడం, ఆహారం నాణ్యత దారుణంగా ఉండటం, టీ చల్లగా ఇవ్వడం వంటి అంశాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. సిబ్బంది తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు మద్దతుగా ఫోటోలు సమర్పించామని తెలిపారు. నవంబర్ 2023లో లీగల్ నోటీసులు పంపినా ఎయిర్‌లైన్ స్పందించలేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఎయిర్‌లైన్ తమవైపు నుంచి అన్ని ప్రామాణిక తనిఖీలు చేసినట్టు, ఎటువంటి ముఖ్య లోపాలు లేవని వాదించింది. ప్రయాణికులు బిజినెస్ క్లాస్ అప్‌గ్రేడ్ కోరారని, సీట్లు ఖాళీ లేక తిరస్కరించామని తెలిపింది. విమాన సిబ్బంది సహాయకంగా వ్యవహరించారని కూడా పేర్కొంది. అయితే కమిషన్ ఎయిర్‌లైన్ వాదనలను సమర్థించలేదు. ఫిర్యాదుదారు సమర్పించిన ఫోటోలు, లీగల్ నోటీసుకు స్పందన లేకపోవడం, ఆరోపణలకు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సేవలో లోపం ఉందని తేల్చింది. ప్రయాణం పూర్తయినందున టికెట్ మొత్తం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, మానసిక క్షోభకు రూ.50,000, వ్యాజ్య ఖర్చులకు రూ.50,000 చెల్లించాలని ఆదేశించింది. ట్రావెల్ బుకింగ్ సంస్థపై బాధ్యత లేదని స్పష్టం చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం విమానయాన సంస్థలు అవసరమైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయని కమిషన్ పునరుద్ఘాటించింది. ప్రయాణికుల హక్కులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ తీర్పు స్పష్టమైన సందేశం ఇచ్చింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us