అదానీ గ్రూప్ వ్యవహారం కీలకమలుపు తిరిగింది. ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిపుణుల కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకరించింది. కమిటీ సభ్యుల పేర్లను సూచించాలని సుప్రీంకోర్టును కోరింది కేంద్రం. ఇన్వెస్టర్ల ప్రయోనాలను కాపాడడడంలో సెబీ చాలా అప్రమత్తంగా ఉందని కేంద్రం తెలిపింది. అదానీ దానీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రభుత్వం, సెబీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణకు హాజరయ్యారు. కమిటి సంబంధించి పేర్లను త్వరలోనే అందజేస్తామని, విస్తృత ప్రయోజనాలరీత్యా సీల్డ్ కవర్‌లో ఆ పేర్లను అందిస్తామని ధర్మాసనానికి తెలియజేశారు. కమిటీ ఏర్పాటు విషయంలో ఏదైనా సమాచారం బయటకు వెళ్తే స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత తలెత్తిన పరిస్థితులపై సెబీ సహా ఇతర అత్యున్నత సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ భారీగా పతనం కావడంపై దాఖలైన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్టర్లు రూ.లక్షల కోట్లు నష్టపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీనికోసం పటిష్ఠమైన యంత్రాంగం రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది అవసరమైతు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో నిపుణుల కమిటీని వేయాలని సూచించింది.
మరోసారి ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? విధి విధానాలు ఎలా ఉండాలన్న అంశంపై కేంద్రం, సెబీలు తమ వైఖరిని వెల్లడించాలని కోరింది. దీంతో కేంద్రం వైఖరిని సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అదానీ వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి