
తెలుగు రాష్ట్రాల్లో వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ఉక్కపోత మొదలైంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఏసీలు, కూలర్లు కొంటుంటారు. అయితే ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ కొనాలా లేక కూలర్ సరిపోతుందా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ధర, కరెంట్ బిల్లు, ఆరోగ్యానికి సంబంధించిన ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక మంచి ఏసీ కొనాలంటే కనీసం రూ. 30,000 నుండి రూ. 75,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే కాదు దీని ఇన్‌స్టాలేషన్ కూడా ఖర్చుతో కూడుకున్న పని. బడ్జెట్ తక్కువ ఉన్నవారికి కూలర్ ఒక వరం. రూ.5000 నుండి రూ. 15,000 లోపే అద్భుతమైన కూలర్లు మార్కెట్లో ఉన్నాయి. దీనికి అదనపు ఇన్ స్టాలేషన్ ఛార్జీలు ఉండవు.
చాలా మంది ఏసీ కొంటారు కానీ బిల్లు చూసి స్విచ్ వేయడానికి భయపడతారు. ఒక టన్ ఏసీ రోజుకు 10 గంటలు వాడితే సుమారు 15 యూనిట్లు కాలుతుంది. యూనిట్ కి రూ. 10 వేసుకున్నా, రోజుకు రూ.150.. అంటే నెలకు రూ. 4,500 కేవలం ఏసీకే ఖర్చవుతుంది. కూలర్ గంటకు కేవలం 0.18 యూనిట్లనే వాడుకుంటుంది. రోజుకు 10 గంటలు వాడినా నెలకు కేవలం రూ. 540 మాత్రమే బిల్లు వస్తుంది. అంటే ఏసీతో పోలిస్తే కూలర్ ఖర్చు దాదాపు 8 రెట్లు తక్కువ.
ఏసీకి ప్రతి ఏటా సర్వీసింగ్ చేయించాలి. గ్యాస్ ఫిల్లింగ్, ఫిల్టర్ క్లీనింగ్ కోసం నిపుణులపై ఆధారపడాలి. కూలర్ నిర్వహణ చాలా సులభం. మనమే క్లీన్ చేసుకోవచ్చు. పైగా దీన్ని ఒక గది నుంచి మరో గదికి ఈజీగా మార్చుకోవచ్చు
ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల చర్మం పొడిబారడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. గదిలోని గాలినే మళ్లీ మళ్లీ వాడటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారికి ఇది కాస్త ఇబ్బందే. కూలర్ బయటి గాలిని లోపలికి పంపుతుంది కాబట్టి గాలిలో తేమ ఉంటుంది. అయితే కూలర్ ట్యాంకులోని నీటిని ప్రతిరోజూ మార్చకపోతే దోమలు, బ్యాక్టీరియా పెరిగి డెంగ్యూ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.
మీది క్లోజ్డ్ బెడ్ రూమ్ అయ్యి, బడ్జెట్ ఇబ్బంది లేకపోతే.. ఏసీ బెస్ట్. ఒకవేళ గాలి వెలుతురు వచ్చే హాల్ లేదా కిటికీలు ఉన్న రూమ్ అయితే తక్కువ ఖర్చుతో కూడిన కూలర్ బెస్ట్ ఛాయిస్. మీ అవసరాన్ని బట్టి సెలక్ట్ చేసుకోండి.