Air Conditioner: ఏసీ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్.. ధరలు మరోసారి పెంపు.. ఎంతంటే..?

సమ్మర్ వేళ ఏసీలు కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్ తగులుతోంది. ఎయిర్ కండీషనర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. జనవరి నుంచి ధరలను తయారీదారులు పెంచుతూనే ఉన్నారు. ఏసీల తయారీకి ఉపయోగించే ముడి సరుకు ధరలు యుద్దం వల్ల పెరుగుతున్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ సరఫరా కొరత వల్ల కూడా ధరలు పెరుగుతున్నాయి.

Air Conditioner: ఏసీ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్.. ధరలు మరోసారి పెంపు.. ఎంతంటే..?
Ac

Updated on: Apr 23, 2026 | 8:45 PM

సమ్మర్ రావడం, ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండంతో ఎండ వేడికి జనాలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దాదాపు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో హీట్‌తో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై జనసంచారం తగ్గుతుండటంతో.. వేడి నుంచి తట్టుకునేందుకు ఇళ్లల్లో చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు ఎక్కువగా వాడుతున్నారు. అయితే సమ్మర్ కారణంగా ఏసీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏసీల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ధరలు పెరిగినా ప్రజలు మాత్రం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు.

మూడు రెట్లు పెరిగిన ధరలు

బీఈఈ నిబంధనల్లో మార్పుల వల్ల జవవరిలో ఏసీల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ తర్వాత ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం కారణంగా గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఏసీ విడిభాగాల సరఫరాకు సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో తయారీదారులు ఏసీల ధరలను మరోసారి పెంచారు. అయితే ఇటీవల రాగి, ప్లాస్టిక్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు పెరిగాయి. ఈ క్రమంలో మరోసారి ఏసీల ధరలను కంపెనీలు పెంచేశాయి. నాలుగు నెలల్లోనే మూడు రెట్లు ధరలు పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. ఇక ఏసీల తయారీలో హీట్ ఎక్చేంజర్ల తయారీకి పెద్ద ఎత్తున వెల్డింగ్ అవసరం. ఈ వెల్డింగ్‌కు ఎల్పీజీ అవసరం. కానీ ఎల్పీజీ సరఫరాలో కొరత వల్ల ఏసీల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.

మరింత పెరిగే అవకాశం

జనవరి 1 నుంచి బీఈఈ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. దీని వల్ల ఫైవ్-స్టార్ ఏసీల అవుట్ డోర్ యూనిట్లు పెద్దగా మారాయి. దీంతో ఏసీ యూనిట్ల విడిభాగాలు అందుబాటులో లేకుండా పోయాయి. దీని వల్ల తయారీ కంపెనీలు త్రీ స్టార్ ఏసీల ఉత్పత్తిని పెంచగా.. గత సంవత్సరం ఫైవ్-స్టార్ ఏషీలు ఈ ఏడాది త్రీ-స్టార్‌గా మారాయి. అయితే పాత స్టాక్ అయిపోతుండగా.. ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల కొత్త స్టాక్ రావడం లేదు. దీని వల్ల ప్రజలు తమకు ఇష్టమైన మోడళ్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ ఏడాదిలో దక్షిణ రాష్ట్రాల్లో ఏసీల అమ్మకాలు భారీగా పెరిగాయి. 80 నుంచి 90 శాతం ఏసీల అమ్మకాలు పెరిగాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. రానున్న రోజుల్లో ఏసీల ధరలు మరింత పెరిగే అవకాశముందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి.

Follow Us