
ఆధార్ కార్డు-పాన్ కార్డు లింకింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139AA ప్రకారం ఆధార్-పాన్ అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవాలి. జూలై 1, 2017న లేదా అంతకంటే ముందు మీరు PAN పాన్ పొంది ఉంటే ఆధార్ నంబర్‌ను ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఉచితంగా లింక్ చేసుకునేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీంతో ఇప్పుడు రూ. 1,000 జరిమానా చెల్లించి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే మీపాన్ కార్డు ఇనాక్టివ్ లేదా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల అనేక రకాల ఆర్థిక, పన్ను సంబంధిత లావాదేవీలలో ఆటంకాలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.
అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ నివాసితులకు దీని నుంచి మినహాయింపు ఉంది. ఇక 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నిర్వచించబడిన ప్రవాసులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. త ఆర్థిక సంవత్సరంలో 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, భారత పౌరులు కానివారు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరం లేదు.
పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలంటే ముందుగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ సందర్శించాలి. ఇ-పే ట్యాక్స్ విభాగానికి వెళ్లి, సంబంధిత పన్ను సంవత్సరాన్ని ఎంచుకోవాలి. అనంతరం చెల్లింపు విభాగాన్ని ఎంచుకుని చెల్లింపును పూర్తి చేయాలి. అనంతరం లింకింగ్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. లేదా సమీపంలో పాన్ కార్డు కార్యాలయం లేదా అధీకృత ఏజెంట్ల దగ్గరికి వెళ్లి లింక్ చేసుకోవచ్చు.
పాన్ కార్డు ఇనాక్టివ్‌గా గుర్తించబడుతుంది. దీనివల్ల ఆర్థిక, పన్ను సంబంధిత కార్యకలాపాలు నిలిచిపోతాయి. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయలేరు లేదా పన్ను వాపసులను క్లెయిమ్ చేయలేరు. ఇక 10 శాతానికి బదులుగా 20 శాతం TDS రేటును కూడా ఎదుర్కోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తెరవడం, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం, డిపాజిటరీలు, పార్టిసిపెంట్లు లేదా సెక్యూరిటీల కస్టోడియన్‌ల వద్ద ఖాతాలు తెరవడం, లేదా కొన్ని అధిక విలువ గల పెట్టుబడి లావాదేవీలను చేపట్టడం వంటివి చేయలేరు. రూ. 50,000 దాటిన మ్యూచువల్ ఫండ్ల కొనుగోలుకు, ఒక్కో లావాదేవీకి రూ. 1 లక్ష దాటిన అన్లిస్టెడ్ కంపెనీ షేర్ల లావాదేవీలకు, కంపెనీలు లేదా సంస్థలు జారీ చేసిన డిబెంచర్లు లేదా బాండ్ల కోసం రూ. 50 వేలు దాటిన చెల్లింపులకు కూడా ఆంక్షలు వర్తిస్తాయి.