
యూట్యూబ్ వచ్చాక ప్రపంచంలో ప్రజల మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ఏ దేశంలో జరిగిన సంఘటన అయినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో తన యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి యూట్యూబ్ ఆటో డబ్బింగ్ ఫీచర్ ను తీసుకువచ్చింది. దీని వల్ల కలిగే ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ తన యూజర్లకు ఆటో డబ్బింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల భాషాపరమైన ఇబ్బందులు లేకుండా కంటెంట్ ను వీక్షించే అవకాశం కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలు ఉన్నాయి. ఏ దేశ ప్రజలు తమ భాషలో కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఇంగ్లిష్ కంటెంట్ తో వచ్చిన వీడియోలు అందరికీ బాగానే అర్థమవుతాయి. కానీ ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ తదితర భాషలపై ఇతర దేశాల వారికి పట్టు ఉండదు. దీని వల్ల ఆ భాషల్లో వచ్చిన కంటెంట్ ను అర్థం చేసుకోలేకపోతున్నారు. యూట్యూబ్ కొత్తగా తీసుకువచ్చిన ఆటో డబ్బింగ్ ఫీచర్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
యూట్యూబ్ కంటెంట్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ చేయడానికి కొత్త ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. విద్య, వినోదం, ఆసక్తికర అంశాలను అందరూ తెలుసుకునే అవకాశం కలుగుతుంది. గూగుల్ కు చెందిన ఏరియా 12 ఇంక్యూబేటర్ లో అలైడ్ డెవలప్ చేసిన ఏఐ టెక్నాలజీని దీనిలో వినియోగిస్తున్నారు. ఇంగ్లిషు, ఇతర భాషల మధ్య ఉన్న దూరంగా ఇది తగ్గిస్తుంది. కొత్త ఫీచర్ ద్వారా ఇంగ్లిషులో ఉన్న కంటెంట్ ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, పోర్చుగీస్, స్పానిష్ భాషల్లోను అనువాదం అవుతుంది. ఆ దేశాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటెంట్ ను ఆస్వాదించవచ్చు. అలాగే ఆయా భాషల్లో ఉన్న కంటెంట్ కూడా ఇంగ్లిష్ లోకి డబ్ అవుతుంది. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలకు ఇంగ్లిష్ తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హిందీలోకి కంటెంట్ అనువాదం కావడం వల్ల మనకూ ఉపయోగమే.
డబ్ చేసిన కంటెంట్ పై ఆటో డబ్డ్ అనే లేబుల్ కనిపిస్తుంది. ఒక వేళ డబ్బింగ్ వాయిస్ వద్దను కుంటే ట్రాక్ సెలెక్టర్ ఆప్షన్ ఉపయోగించి ఒరిజినల్ వాయిస్ వినవచ్చు. కంటెంట్ క్రియేటర్లు వీడియోను అప్ లోడ్ చేయగానే వెంటనే సపోర్టు చేసే భాషలోకి మారుతుంది. యూట్యూబ్ లోని లేటెస్ట్ సెట్టింగ్ ల కింద ఈ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్లను యూజర్లందరికీ అందబాటులోకి తీసుకురావడానికి యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి