Mudra Yojana: కేవలం రూ.3250 చెల్లిస్తే చాలు.. రూ.20 లక్షల లోన్.. నిజంగానే వస్తుందా..?

పీఎం ముద్రా యోజన పథకం గురించి అందరికీ తెలిసిందే. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు ఈ పథకం ద్వారా పూచీకత్తు లేని రుణాలను కేంద్రం అందిస్తోంది. బ్యాంకుల ద్వారా వీటిని మంజూరు చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈ పథకానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

Mudra Yojana: కేవలం రూ.3250 చెల్లిస్తే చాలు.. రూ.20 లక్షల లోన్.. నిజంగానే వస్తుందా..?
Central Government

Updated on: Aug 20, 2026 | 12:29 PM

మహిళలకు ఆర్దికంగా తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా మహిళలు కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంక్ రుణం పొందవచ్చు. ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టుకుండా ఈ రుణాన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే తాజాగా ముద్రా లోన్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే..? రూ.3250 చెల్లిస్తే రూ.20 లక్షల రుణం మంజూరు అవుతుందంటూ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

ప్రధానమంత్రి ముద్రా యోజనలో లబ్ది పొందేందుకు రూ.3250 రుసుం చెల్లిస్తే.. రూ.20 లక్షల లోన్ వస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అలాగే లోన్ అప్రూవల్ లెటర్స్ వచ్చినట్లు కొన్ని లెటర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేంద్రం వీటిపై స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగమైన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా అవాస్తవమని, ప్రజలు నమ్మవద్దని సూచించింది. ఇలాంటి ఫేక్ లెటర్స్‌ను నమ్మి మోసపోవద్దని సూచించింది. కొంతమంది ఇది నిజమేనని నమ్మి డబ్బులు కడుతున్నారని, అలా చెల్లించి మోసానికి గురి కావొద్దని సూచించింది. కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్ మంజూరు చేసేందుకు ఎలాంటి ఛార్జీలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.

“ముద్రా లోన్ కావాలనుకుంటే రూ.3250 అగ్రిమెంట్ ఛార్జీ చెల్లిస్తే.. రూ.20 లక్షల లోన్ మంజూరు అవుతుంది. ఆధార్, పాన్ ఆధారంగా ఆమోదం పొందింది. దీనికి సంబంధించిన వివరాలు లేఖలో ఉన్నాయి. 12 ఏళ్ల పాటు నెలకు రూ.15,634 ఈఎంఐ చెల్లిస్తే 30 శాతం సబ్సిడీ వస్తుంది” అంటూ నెట్టింట ఒక అగ్రిమెంట్ కాపీ వైరల్ అవుతుంది. అయితే ఈ లెటర్లు మొత్తం బోగస్ అని పీఐబీ తెలిపింది. ముద్ర యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఏ చిరు వ్యాపారికి లోన్ ఇవ్వదని తెలిపింది. బ్యాంకులు మాత్రమే అర్హులైనవారికి రుణాలు మంజూరు చేస్తాయని తెలిపింది. ముద్రా లోన్ కోసం ముందుగా ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు, అగ్రిమెంట్ ఛార్జీలు వసూలు చేయదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏమైనా మెస్సేజ్‌లు అనుమానాస్పదంగా ఉంటే factcheck@pib.gov.in మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. అధికారిక సమాచారం కోసం Mudra.org.in పోర్టల్ సందర్శించాలని పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us