10 గ్రాముల బంగారం లక్ష రూపాయిలు. ఈ మాట వింటేనే గుండె కలుక్కుమంటుంది. వెంటనే ఇంట్లో మహిళల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నేను అక్కడికీ కొనమని చెబుతూనే ఉన్నాను.. మీరే పట్టించుకోలేదు.. చూడండి.. ఇప్పుడు పది గ్రాముల బంగారం లక్ష రూపాయలు అవుతుందంట.. అన్న డైలాగులు భర్తలకు ఎదురవుతాయి. అయితే.. ఇప్పుడు దాని రేటు ఇంకా లక్ష రూపాయిలు అవ్వలేదు. కానీ త్వరలో ఆ ముచ్చటా ఉంటుంది అంటున్నారు. నిపుణులు, ఆల్రెడీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79 వేల మార్కును టచ్ చేసింది. ఇక ఇది దీపావళి, ధన్ తేరస్ వంటి పండుగల సీజన్. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఇంకేముంది.. పసిడి పరుగుకు కళ్లెం వేయడానికి అవకాశమే లేకుండా పోయింది.
అంతర్జాతీయంగా చూస్తే.. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అటు చైనా ఏమో.. తైవాన్ ను భయపెడుతోంది. రష్యా-ఉక్రెయిన్ వార్ సంగతీ తెలిసిందే. ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా నవంబర్ నెలలో ఉన్నాయి. దాని ఫలితాలు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయి. అంటే దేశీయంగా ఉన్న పరిస్థితులతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, సామాజిక సంక్షోభాలు కూడా బంగారం ధరను అమాంతం పెంచేస్తున్నాయి. గత 20 ఏళ్లలో పుత్తడి ధర పెరిగిన తీరు చూస్తే.. బాబోయ్ అనాల్సిందే. అంతలా పెరిగిపోయింది. 2004లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 6 వేల 300 వందలు. ఇప్పుడు దాదాపు 79 వేల రూపాయిలు.
ఇక ఈ సంవత్సరాంతానికి 10 గ్రాముల పుత్తడి ధర లక్ష రూపాయిలు అవుతుందా? పెరగడం అయితే పక్కా. కాకపోతే ఇప్పుడే లక్ష అవుతుందని చెప్పలేం. కాకపోతే 80 వేల ధర దగ్గర దీని జోరుకు కాస్త బ్రేకులు పడే అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ తొలి వారంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందేమో అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అందుకే చాలామంది తమ మదుపును బంగారం మీదకు మళ్లించారు. దీంతో గోల్డ్ రేటు పెరిగింది. ఇక నవంబర్ లో అమెరికా ఫెడరల్ పాలసీని బట్టి మళ్లీ బంగారం ధరపై ప్రభావం ఉంటుంది. అయితే అప్పుడు రేటు ఎంత పెరుగుతుంది అన్నది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు నిపుణులు. కానీ ఇప్పుడున్న పరిణామాల దృష్ట్యా బంగారాన్ని కొనడానికి ఇది మంచి సమయమే అని మాత్రం చెప్పగలుగుతున్నారు.
బంగారాన్ని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి వారికి ఇప్పుడు తలకు మించిన భారం. 10 గ్రాముల గోల్డ్ కు 70వేలకు పైగా మదుపు పెట్టి.. దానికి జీఎస్టీ అదనంగా కట్టి.. మజూరీ ఛార్జీలు చెల్లించి.. అబ్బో.. మొత్తం ఖర్చు చూస్తే.. తడిసి మోపెడు అవుతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఉద్యోగస్తులైతే.. నెల నెలా కాని, ఏడాదికోసారో లేదా పండగల సమయంలో కాని బంగారాన్ని కొంటారు. అలా దేశం మొత్తం మీద ఇప్పటివరకు కుటుంబాలు కొన్న.. వాటి దగ్గర ఉన్న బంగారం ఎంతో తెలుసా? అది.. 25 వేల టన్నులకు పైగా ఉంటుంది. దీనికి విలువ కడితే.. 126 లక్షల కోట్ల రూపాయిలు అవుతుంది. అదీ భారతీయుల గోల్డ్ సత్తా. సాధారణంగా మనవాళ్లు బంగారాన్ని మదుపు మార్గంగానే చూస్తారు. కష్టకాలంలో కుదవ పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికైనా ఉంటుందన్న భరోసాతో దీనిని కొనడానికి ఇష్టపడతారు. ఇక పెళ్లి సమయంలో అమ్మాయి తరపువారు.. లాంఛనాలతో పాటు కచ్చితంగా ఎంతోకొంత బంగారం పెడతారు. అదయితే.. తమ ఇంటి ఆడపిల్ల దగ్గరే ఉంటుందని ఆపత్కాలంలో ఆదుకుంటుందని వారి నమ్మకం. అందుకే మన దేశంలో పుత్తడికి అంత డిమాండ్ ఉంటుంది.
ప్రస్తుతం అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. దాదాపు 79 వేల రూపాయిలు ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72 వేల 400 రూపాయిలు ఉంది. ఈ ధరలో స్వల్ప హెచ్చుతగ్గులే కాని.. అధిక మొత్తంలో తగ్గే అవకాశం లేదని నిపుణులు క్లియర్ గా చెబుతున్నారు. అందుకే ఉన్నంతలో ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మన దేశంలో 6 లక్షల 64 వేలకు పైగా గ్రామాలు ఉన్నాయి. కానీ వీటిలో దాదాపు 40 వేల గ్రామాల్లో మాత్రమే బ్యాంకులకు బ్రాంచీలు ఉన్నాయి. మరి మిగిలిన గ్రామాల సంగతేంటి? అందుకే చేతిలో డబ్బు ఉన్నప్పుడు దానిని బ్యాంకులో దాచుకోవడం కంటే.. బంగారాన్ని కొనడానికే మనవాళ్లు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అదయితే.. అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవడం కూడా సులభమే. 2022లో భారతదేశంలోని 15 శాతం కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. అదే 2023కి వచ్చేసరికీ ఆ సంఖ్య 21 శాతానికి పెరిగింది. దీనివల్లే పుత్తడికి డిమాండ్ పెరుగుతోంది. దానితోపాటే ధరా పెరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. బంగారం కొనడం మనవాళ్ల దృష్టిలో ఖర్చు కాదు.. సంక్షోభంలో ఆదుకునే పెట్టుబడి.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి