బోటు ఊబిలో కూరుకుపోయిందా..? అందుకే ఈ సమస్యలా..!

| Edited By:

Oct 02, 2019 | 11:31 AM

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న రెండోరోజు జరిపిన ఆపరేషన్‌ వశిష్ట సత్ఫలితాలను ఇవ్వలేదు. బోటు వెలికితీత ప్రక్రియలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. సంఘటన స్థలంలో మరో బోటు సహకారంతో ధర్మాడి సత్యం బృంద సభ్యులు నదిలోకి లంగర్లు వేసి అన్వేషణ కొనసాగిస్తున్నారు. గోదావరిలో కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం రెండో రోజు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. బోటు […]

బోటు ఊబిలో కూరుకుపోయిందా..? అందుకే ఈ సమస్యలా..!
Follow us on

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్న రెండోరోజు జరిపిన ఆపరేషన్‌ వశిష్ట సత్ఫలితాలను ఇవ్వలేదు. బోటు వెలికితీత ప్రక్రియలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. సంఘటన స్థలంలో మరో బోటు సహకారంతో ధర్మాడి సత్యం బృంద సభ్యులు నదిలోకి లంగర్లు వేసి అన్వేషణ కొనసాగిస్తున్నారు.

గోదావరిలో కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం రెండో రోజు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. బోటు మునిగిన ప్రాంతంలో సోమవారం వలయాకారంలో నదిలోకి వదిలిన ఐరన్‌ రోప్‌ను మంగళవారం జేసీబీ సాయంతో ఒడ్డుకు లాగుతుండగా రాతి బండలకు చుట్టుకుని తెగిపోయింది. దీంతో వ్యూహం మార్చారు. ఏపీ టూరిజం బోటుకు పంటును జత చేసి.. 800 మీటర్ల పొడవైన ఐరన్‌ రోప్‌కు చివరన లంగరు కట్టారు. దానిని మునిగిన బోటు ఉన్నట్టుగా భావిస్తున్న ప్రాంతంలో వదులుకుంటూ వచ్చారు.

అయితే.. ఆ రోప్‌ను లాగగా.. లంగరు మాత్రమే బయటకొచ్చింది. దీంతో రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. బోటుకి.. జేసీబీకి మధ్య ఉన్న రోప్‌ తెగిపోయింది. లంగరు వేసి బోట్‌ని లాక్‌ చేశారు. లంగరుకి లింక్‌ ఉన్న ఐరన్‌ రోప్‌ని బయట జేసీబీకి లింక్‌ చేశారు. జేసీబీ సాయంతో బోట్‌ని లాగడానికి ప్రయత్నించారు. అయితే.. మధ్యలో రోప్‌ తెగిపోయింది. రోప్‌ తెగిపోవడంతో ఆపరేషన్‌ వశిష్టకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది. దీంతో పాటు.. అనుకూల వాతావరణం కూడా ఆపరేషన్‌కు అడ్డంకిగా మారింది. 17 రోజుల క్రితం నీటిలో మునిగిపోయిన బోటుని మట్టి, ఇసుక కమ్మేసిందని.. బురదలో కూరుకుపోవటం వల్లనే బోటు కదల్లేని పరిస్థితుల్లో రోప్‌ తెగిపోయిందని తేలింది.

మునిగిన బోటును పైకి తెచ్చేవరకు తమ ఆపరేషన్‌ కొనసాగుతుందని వెలికితీత బృందానికి నాయకత్వం వహిస్తున్న ధర్మాడి సత్యం చెప్పారు. తొలి వ్యూహంలో భాగంగా గోదావరిలో 2వేల మీటర్ల ఐరన్‌ రోప్‌ను వలయంగా వేశామన్నారు ధర్మాడి సత్యం. అది నదిలోని రాతిబండలకు చుట్టుకోవడంతో తెగిపోయిందన్నారు. సుమారు వెయ్యి మీటర్ల ఐరన్‌ రోప్‌ గోదావరిలోనే ఉండిపోయిందన్నారు. దాని విలువ 2 లక్షల రూపాయల వరకూ ఉంటుందన్నారు. బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

రాయల్‌ వశిష్ట బోటు దాదాపు 200 అడుగుల లోతులో ఉందని ధర్మాడి బృందం అంచనా వేస్తోంది. వేగంగా ప్రవహించే నీరు పక్కనే ఉన్న కొండను తాకి వెనక్కి తిరుగుతుంది. అలా వెనక్కి తిరిగే క్రమంలో సుడిగుండాలు ఏర్పడుతాయి. ఈ సుడిగుండాల్లో చిక్కుకునే రాయల్‌ వశిష్ట బోటు నీళ్లలో మునిగిపోయింది. అయితే.. ఇప్పుడు బోటు మట్టిలో కూరుకు పోడానికి కూడా సుడిగుండాలే కారణమయ్యి ఉంటాయన్నది ఒక అంచనా. సుడిగుండాలతో మట్టి కొట్టుకొచ్చి బోటుపైన పడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో బోటు బురదలో కూరుకుపోయిందని అర్థమవుతోంది. బోటు బరువు దాదాపు 40 టన్నులు ఉంటుందని తెలుస్తోంది. దీంతో దాన్ని కదిలించడం ఇప్పుడు కష్టతరమైన పనిగానే చెప్పాలి. బోటుని బుదరలోంచి పెకిలించగలిగితే.. దాన్ని ఒడ్డుకు లాగడం పెద్ద సమస్య ఏమీ కాదన్నది అర్థమవుతోంది.