కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ, కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే కేరళ పార్టీ కార్యకర్తలు రాహుల్‌ను కోరారని, కేరళ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తోందని చెప్పారు. కార్యకర్తల విజ్ఞప్తిని రాహుల్ సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు.
అమేథి నుంచి రాహుల్ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఈనెల ప్రారంభంలో ప్రకటించగా, ఈ నియోజకవర్గం నుంచి స్మృతి ఇరానీని బీజేపీ నిలబెట్టింది. కాగా, తమిళనాడు, కర్ణాటక పార్టీ విభాగాలు సైతం రాహుల్‌ను తమతమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. ఇప్పుడు కేరళ కాంగ్రెస్ యూనిట్ సైతం రాహుల్‌ను వాయనాడ్ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరింది. గత ఏడాది కేరళ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంఐ షానవాస్ కన్నుమూయడంతో వాయనాడ్ సీటు ఖాళీ అయింది. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధిఖ్ పోటీలో ఉన్నప్పటికీ, రాహుల్ వస్తే స్వచ్ఛందంగా తప్పుకుంటానని ఆయన ప్రకటించారు.