తనపై అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పీతల సుజాత కన్నీరు పెట్టుకున్నారు. తన మంత్రి పదవి పోయినప్పుడు చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నానని తెలిపిన సుజాత ఈ ఎన్నికల్లో టికెట్ రానందుకు కూడా తాను బాధపడలేదని అన్నారు. ఇన్నిరోజులు ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసంతోనే తాను పనిచేశానని సుజాత తెలిపారు.
పాపాలు చేసినందుకే తనకు టికెట్ ఇవ్వలేదని అంబికా మాట్లాడటం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆమె అన్నారు. సొంత బావమరిది హోటల్ అంబికా లాక్కున్నారని.. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని సుజాత విమర్శలు చేశారు. అంతేకాదు వైసీపీలో చేరేందుకు కూడా అంబికా ప్రయత్నించారని ఆమె ఆరోపణలు చేశారు.
అయితే ఏలూరులో జరిగిన ఓ సభలో అంబికా కృష్ణ, పీతల సుజాతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజాతకు పొగరు, అహంకారం అంటూ ఆయన నోటికొచ్చినట్లు తిట్టారు. మంత్రిగా ఉండి సుజాత నియోజకవర్గంలో చేసిందేమి లేదని, అభివృద్ధి శూన్యమని, పాపాలు తగలకూడదనే సీఎం చంద్రబాబు సుజాతకు సీటు ఇవ్వలేదంటూ అంబికా కృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.