ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ తన అభ్యర్థుల తొలి జాబితాను గురువారం విడుదల చేయనుంది. దీంతో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ప్రచారంలో భాగంగా గురువారం తొలుత తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు.. ఆ తరువాత చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం శ్రీకాకుళం చేరుకొని ఆ జిల్లా పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. అలా 16 నుంచి 19వ తేది వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా స్థాయి నాయకత్వం మొదలుకొని సేవామిత్రలు, బూత్ స్థాయి కన్వీనర్ల వరకు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి.. ఆయా జిల్లాల్లో బహిరంగసభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.