TDP leaders approached Supreme Court on BC reservations issue: ఏపీ తెలుగుదేశం నేతలు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపును సవాలు చేస్తూ టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయానికి సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు దేశం నేతలు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ముందు మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు బీసీ రిజర్వేషన్ల కుదింపు నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ వైఫల్యం వల్లనే బీసీలకు అన్యాయం జరిగిందని టీడీపీ నేతలంటున్నారు.
వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు హైకోర్టు, సుప్రీంకోర్టులోను బీసీ రిజర్వేషన్లను తగ్గింపచేసేందుకు ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని, జగన్ అధికారంలోకి రావడానికి బీసీలు సహకరిస్తే వారి రిజర్వేషన్లనే జగన్ కుదిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు.
బీసీ రిజర్వేషన్లు తగ్గడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది బీసీ నాయకుల పోటీ చేసే అవకాశం కోల్పోతారన్నది టీడీపీ నేతల వాదన. బీసీల కేసులో సమర్ధుడైన లాయర్‌ని ఎందుకు నియమించలేదని వారు ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 176ను యధాతథంగా అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు సుప్రీంకోర్టులో పోరాటం చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించారు.