ఉన్నావ్ : వివాదాలకు కేరాఫ్‌గా మారిన బీజేపీ లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఈసారి ఏకంగా ఓటర్లపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తనకు ఓటేయకుంటే అందరిని శపిస్తానని ఆయన హెచ్చరించారు. తాను ఓ సన్యాసిననీ, తాను అడిగింది ఇవ్వకపోతే చెడు కలుగుతుందని పురాణాల్లో ఉందని వ్యాఖ్యానించారు. తనకు ఓటేయనివారు సుఖాలకు దూరమై పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తారని సాక్షి మహరాజ్ హెచ్చరించారు.
తాను ఆస్తులు అడగటం లేదనీ, దేశంలోని 125 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే ఓటును మాత్రమే అడుగుతున్నానని అన్నారు. యూపీలోని ఉన్నావ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సాక్షి మహరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉన్నావ్ నుంచి సాక్షి మహరాజ్ ఘనవిజయం సాధించారు. 2019లో మోదీ నెగ్గితే 2024లో ఎన్నికలే ఉండవని సాక్షి మహరాజ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగింది.