#COVID19 తబ్లిఘీ తర్వాత తెలంగాణకు మరో థ్రెట్… భీమ్ ఆర్మీ

|

Apr 07, 2020 | 3:04 PM

తెలంగాణలో తబ్లిఘీ జమాత్ వర్కర్స్ సృష్టించిన కరోనా కలకలం ఇంకా సమసిపోకముందే తెలంగాణకు మరో ముప్పు పొంచివున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తబ్లిఘీ సంస్థ వర్కర్లతోపాటు ఈ సంస్థ వర్కర్లు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీ నుంచి...

#COVID19 తబ్లిఘీ తర్వాత తెలంగాణకు మరో థ్రెట్... భీమ్ ఆర్మీ
Follow us on

One more threat to Telangana after Tablighi: తెలంగాణలో తబ్లిఘీ జమాత్ వర్కర్స్ సృష్టించిన కరోనా కలకలం ఇంకా సమసిపోకముందే తెలంగాణకు మరో ముప్పు పొంచివున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తబ్లిఘీ సంస్థ వర్కర్లతోపాటు ఈ సంస్థ వర్కర్లు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రైలులో రావడంతో వారికి కూడా కరోనా సోకి వుండవచ్చన్న భయాందోళన వ్యక్తమవుతోంది. దాంతో వారందరినీ క్వారెంటైన్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది.

భీమ్ ఆర్మీ.. తెలంగాణలో విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ ఇది. ఈ భీమ్ ఆర్మీకి చెందిన 11 మంది సభ్యులు గల బృందం మార్చి 13వ తేదీన ఢిల్లీకి వెళ్ళింది. అదే ట్రైన్‌లో తబ్లిఘీ సంస్థకు చెందిన వారు ప్రయాణించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్ బృందం కూడా నాలుగురోజుల పాటు.. ఢిల్లీలో వుండి ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు వీరంతా పలువురు ఢిల్లీలోని తెలుగు మీడియా జర్నలిస్టులను కలిశారు.

ఆ తర్వాత మార్చి 17వ తేదీన భీమ్ సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రెయిన్‌లో తిరిగి వచ్చారు. అదే రైలులో పెద్ద సంఖ్యలో తబ్లిఘీ వర్కర్లు ప్రయాణం చేశారు. ఈ భీమ్ ఆర్మీకి చెందిన 11 మందిలో ఇద్దరికి ఆల్ రెడీ కరోనా వైరస్ పాజిటివ్ రికార్డయ్యింది. దాంతో మిగిలిన తొమ్మిది మందిని క్వారెంటైన్‌లో పెట్టారు. భీమ్ ఆర్మీలో ఖమ్మంలో ఒకరికి, మహబూబాబాద్‌లో మరొకరికి కరోనా పాజిటివ్ కనిపించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ భీమ్ టీమ్ సభ్యులు ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ వీరంతా పెద్ద సంఖ్యలో తమ సంస్థ కార్యకర్తలో భేటీలు కానీ, సమాలోచనలు గానీ జరిపినట్లయితే పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి జరిగి వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ముందుగా ఈ తొమ్మిది మందిని క్వారెంటైన్‌కు తరలించామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

అయితే, భీమ్ ఆర్మీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు సుజిత్ మాత్రం ఢిల్లీ ట్రెయిన్ ద్వారా తమ సభ్యులకు కరోనా సోకలేదని చెబుతున్నారు. ఢిల్లీ నుంచి తిరుగు పయనంలో ఇద్దరు కాజీపేటలో దిగిపోయి శాతవాహన ఎక్స్ ప్రెస్‌లో ఖమ్మం వెళ్ళారని వారికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చినందున, శాతవాహనలోనే కరోనా సోకి వుండొచ్చంటున్నారు సుజిత్. అదే సమయంలో మిగిలిన తొమ్మిది మంది సెల్ఫ్ క్వారెంటైన్‌లో వున్నామని, తాము హైదరాబాద్ వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరినీ కల్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.