తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా చర్చనీయాంశమైన ఏపీ ముఖ్యమంత్రి జగన్, మెగాస్టార్ చిరంజీవిల భేటీకి ముహూర్తం కుదిరింది. సోమవారం అమరావతి ఇందుకు వేదికైంది. వీరిద్దరి భేటీకి సంబంధించి పలు అంశాలు చర్చల్లో నానుతున్నాయి. సైరా నరసింహారెడ్డి సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపేందుకే చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రిని కలిశారని మెగాస్టార్ సన్నిహితులు చెబుతున్నా… వీరిద్దరి భేటీకి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తోడయ్యాయని విశ్వసనీయ వర్గాల భోగట్టా.
ఆల్ మోస్ట్ ఒక దశాబ్ద కాలంపాటు రాజకీయాల్లో కొనసాగిన చిరంజీవి.. గత మూడేళ్ళుగా రాజకీయాలతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా కేంద్రంలో కేబినెట్ మంత్రి పదవిని అనుభవించిన చిరంజీవి.. 2014 తర్వాత స్లోగా రాజకీయాలకు దూరమయ్యారు. 2016లో తమిళ సినిమా రీమేక్ తో టాలీవుడ్లోకి రీ ఎంట్రీకి సిద్దమయ్యారు చిరంజీవి. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో బిజీ అయ్యారు. ఇలా దశాబ్ద కాలం పాటు నెరపిన రాజకీయాలను కాదని తనకు కలిసి వచ్చిన సినీ రంగంలోనే ఇక తన ఫ్యూచర్ అన్న సంకేతాలిచ్చారు.
అయితే.. చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నా… ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ మాత్రం సొంతంగా జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2014ఎన్నికల్లో పోటీకి దూరంగా వున్న పవన్ కల్యాణ్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అనూహ్యంగా.. దారుణ పరాజయం పాలయ్యారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి..ఒక చోట గెలుపొందగా.. 2019 పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అయితే.. రాజకీయాల్లో గెలుపోటములు కామన్ అన్న సూత్రాన్ని పాటిస్తూ.. రాజకీయాల్లో కాస్త యాక్టివ్ గానే వున్నారు పవన్ కల్యాణ్.
అయితే.. జనసేనాధిపతిగా కొనసాగుతున్న పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో న్యూట్రల్ గా వుంటూ.. జగన్ తో నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతున్నారు. జగన్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కల్వడం ఆశ్చర్యానికి గురి చేసే అంశమే. పవన్ కల్యాణ్, జగన్ మధ్య సయోధ్య కుదుర్చే బాధ్యతను చిరంజీవి భుజానికెత్తుకున్నారని ప్రచారం జరుగుతున్నా.. అందులో వాస్తవమెంత అనేది తేలాల్సి వుంది.
మెగా ఫ్యాన్స్ లో చీలిక ?
సీఎం జగన్ తో చిరంజీవి భేటీ కావడం మెగాస్టార్ అభిమానులను కలవరపరుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా వున్నారని తెలుస్తోంది. ఒక వైపు జనసేనాని ప్రభుత్వ విధానాలపై పోరాడుతుంటే.. చిరంజీవి వెళ్ళి ఏకంగా ముఖ్యమంత్రితో భేటీ కావడం ఏంటని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో వారు తీవ్ర అసంతృప్తితో వున్నట్లు సమాచారం. అయితే.. చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం మెగాస్టార్ మీట్ కేవలం సైరా సక్సెస్ నేపథ్యంలో ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు తెలిపేందుకేనని వాదిస్తున్నారు. మొత్తమ్మీద ఇద్దరి అభిమానుల్లో భిన్నాభిప్రాయాలున్న నేపథ్యంలో భవిష్యత్ లో వచ్చే మెగా ఫ్యామిలీ సినిమాలపై ప్రభావం పడుతుందని అంటున్నారు.
అయితే.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ ప్రముఖులెవరు ఆయన్ను కలవలేదంటూ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చిరంజీవి.. ముఖ్యమంత్రిని కల్వడం చర్చనీయాంశమైంది. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి.. తన వంతు బాధ్యతగా చేసే చర్యలను చిరంజీవి ముఖ్యమంత్రికి వివరించి, ప్రభుత్వ సహకారాన్ని కోరారని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైజాగ్లో సినీ స్టూడియో నిర్మించడమో లేక తమ సంస్థ నిర్మిస్తున్న సినిమాలను ఎక్కువగా ఏపీలో చిత్రించడమో చిరంజీవి చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ రెండు అంశాలతో పాటు మరో ఆసక్తికరమైన కథనం చర్చల్లో నానుతోంది. గత కొంతకాలం టిడిపిలో స్థబ్ధుగా వున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు తరపున చిరంజీవి వకాల్తా పుచ్చుకుని వుండి వుంటారని, ఆయన్ని వైసీపీలో చేర్చుకోమని ఈ భేటీలో చిరంజీవి, వైసీపీ అధినేతను కోరి వుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. తన సొంత సామాజిక వర్గానికి చెందిన గంటా.. చిరంజీవికి అత్యంత ఆప్తుడని.. ఆయన వైసీపీలో వుంటే ఏపీలో తనకెంతో ఉపయోగకరంగా వుంటారని మెగాస్టార్ వ్యూహమని కూడా చెబుతున్నారు.
మొత్తానికి చిరంజీవి, జగన్ ల భేటీ ఏపీ రాజకీయాల్లో పలు ఊహాగానాలకు తెరలేపింది. ఇద్దరి భవిష్యత్ చర్యలే వీరిద్దరి భేటీ ఎందుకు జరిగింది ? వీరిద్దరు ఏ ఏ అంశాలను చర్చించారనేది వెలుగులోకి తెస్తాయి.