కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ గురువారం సెటైర్ వేశారు. ‘ లేటుగా రెస్పాండ్ అయ్యే ట్యూబ్‌లైట్ లాంటివారని’ రాహుల్ ని అభివర్ణించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద పార్లమెంటులో జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన..ఒక సందర్భంలో రాహుల్ పాల్గొన్న ర్యాలీగురించి ప్రస్తావించారు. ఆరు నెలల్లో యువతకు ఉద్యోగాలు కల్పించకపోతే ప్రధానిని విపక్షాలు కర్రలతో కొడతాయని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు రాహుల్ మాట్లాడేందుకు లేవబోగా..ఆయనను వారిస్తున్నట్టు మోదీ..’ నేను 30-40 నిముషాల నుంచి మాట్లాడుతున్నానని, కానీ ఇక్కడికి మీరు వచ్చేందుకు (ఈ సమయానికి) చాలా సమయం పట్టిందని’ అన్నారు.
‘బహుత్ సే ట్యూబ్ లైట్ ఐసే హీ హొతే హై ‘ (ఎన్నో ట్యూబ్ లైట్లు ఇలాగే ఉంటాయి) అని చమత్కరించారు. అంతకుముందు రాహుల్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ నేతలెవరూ తమ సత్తా చూపలేకపోయారని, ఒక నాయకుడు మోదీని ఆరు నెలల్లో కర్రతో కొడతానని అన్నాడని (పరోక్షంగా రాహుల్ ని ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. ‘ఇది నిజమే ! ఇది చాలా కష్టతరమైన పని.. ఇందుకు ఆరు నెలల సమయం పడుతుంది. ఈ ఆరునెలల కాలంలో నేను ప్రిపేర్ అయి.. మరిన్ని సూర్య నమస్కారాలు చేసి సిధ్దపడతా.. ఇలాంటి నిందలను భరిస్తూనే ఉంటా.. నన్ను నేను తిట్లకు అతీతంగా మలచుకుంటా.. అలాగే దండా (కర్ర) దెబ్బలు తగల్లేనివాడిగా ‘దండా ప్రూఫ్’ గా మారుతా ‘ అని మోదీ తనను తాను ‘శక్తిమంతుడిగా’ అభివర్ణించుకున్నారు. ఇలా… పార్లమెంటులో రాహుల్ గాంధీపై ఆయన చమక్కులు, చణకులతో దాదాపు ‘ విరుచుకపడినంత పని చేశారు’.