మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే కి ఊరట లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న శాసన మండలి స్థానాలకు ఎన్నికలను ప్రకటించాలని గవర్నర్ కోష్యారీ ఎన్నికల కమిషన్ ను కోరారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని నివారించేలా చూడాలని ఉధ్దవ్ నిన్న ప్రధాని మోదీకి ఫోన్ చేసి అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీన్ని పరిశీలిస్తానని మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ఉధ్దవ్ థాక్రేని శాసన మండలికి నామినేట్ చేస్తూ మంత్రివర్గం చేసిన సిఫారసుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రెండు రోజులు జాప్యం చేయడంపై ఉధ్దవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆయన ఈసీని కౌన్సిల్ ఎన్నికలపై సంప్రదించడంతో ఉధ్ధవ్ కలవరం తగ్గింది. మే 28 లోగా కౌన్సిల్ కి ఎన్నికలు జరగవలసి ఉంది. ఆ రోజుతో సీఎం గా ఉధ్ధవ్ పదవీకాలం ఆరు నెలలు పూర్తి అవుతుంది. ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగకపోతే అయన పదవిని కోల్పోవలసి వస్తుంది.