జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మీరు మా దగ్గరికి రావద్దు.. ఈ మాటలన్నది ఎక్కడ? ఎవరు? ఎందుకన్నారు? అని అలోచిస్తున్నారా? జోష్ మీదున్న జనసేనానిని రావద్దన్నది ఎవరు? మరి పవన్ కల్యాణ్ ఎలా రియాక్టయ్యారు?
పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనలో వున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ ఆరో తేదీ వరకు రాయలసీమలో పర్యటిస్తున్నారు పవన్ కల్యాణ్. అందులో భాగంగా జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ పటిష్టతపై నజర్ పెట్టారాయన. అదే సమయంలో అధికార పార్టీపైనా, ప్రభుత్వ వైఫల్యాలపైనా విమర్శలతో హోరెత్తిస్తున్నారు. సీమ పర్యటనలో పవన్ కామెంట్లు సీమ టపాకాయల్లా పేలుతూ ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
సీమ పర్యటనలో వున్న జనసేనాని.. గురువారం నాడు మదనపల్లిలో పర్యటించబోతున్నారు. అక్కడి మార్కెట్ యార్డులో రైతాంగంతో భేటీ అయ్యేలా జనసేన పార్టీ నేతలు కార్యక్రమం రూపొందించారు. అయితే.. తమ మార్కెట్ యార్డు ఆవరణలోకి రావద్దంటున్నారు మదనపల్లె టమోటా మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శి. దాంతో పవన్ పర్యటనపై వివాదం మొదలైంది. టమోటా మార్కెట్ యార్డు సందర్శనకు అనుమతి నిరాకరిస్తూ జనసేనానికి లేఖ రాశారు కార్యదర్శి.
టమోటా సీజన్ మొదలైనందున మార్కెట్ యార్డు బిజీగా వుందని, రైతులతో కిటకిట లాడుతోందని కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నారు. పవన్ పర్యటన వల్ల రైతాంగానికి ఇబ్బంది కలుగుతుందని, టమోటా రైతుల విక్రమాలకు, వ్యాపారుల కొనుగోళ్ళను అసౌకర్యం కలుగుతుందని కార్యదర్శి కారణం చూపుతున్నారు.
వచ్చి తీరతానంటున్న జనసేనాని..
మదనపల్లి మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శి అనుమతి నిరాకరణపై జనసేనాని స్పందించారు. ‘‘నేను మదనపల్లెలో మార్కెట్ యార్డ్‌కి వెళ్లి రైతుల్ని కలుస్తా అంటే వైసిపి ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటోంది.. మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మార్కెట్ యార్డ్ రోడ్డు మీదే కూర్చుంటా..ఎవడు అడ్డుకుంటాడో చూస్తాను.. ఎవడికి కావాలి మీ పర్మిషన్లు.. మీరు నన్ను ఎంత ఆపితే అంత ముందుకు వెళ్తా..మేము సింహాల్లాంటోళ్లం.. మేకలం కాదు.. 150 మంది ఎమ్మెల్యేలున్న వైసిపి ఎంత.. నాకు రెండు వేళ్ళతో సమానం..’’ అంటూ హూంకరించారు పవన్ కల్యాణ్.
మరోవైపు అనుమతి నిరాకరణపై జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోను పవన్ కల్యాణ్ మార్కెట్ యార్డులో పర్యటిస్తారని, రైతులతో సమావేశమవుతారని చెబుతున్నారు. దాంతో జనసేనాని పర్యటన మదనపల్లెలో ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది.